తాము డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రంతో నష్టపోయినప్పుడు పంపిణీదారులు నష్టపరిహారం డిమాండ్ చెయ్యడం ఓ ట్రెండ్ గా మారింది. అది కోలీవుడ్ కావచ్చు...టాలీవుడ్ కావచ్చు...బాలీవుడ్ కావచ్చు. అన్ని చోట్లా ఒకటే పరిస్దితి. ఓ ప్రక్కన 'సర్దార్ గబ్బర్ సింగ్' డిస్ట్రిబ్యూటర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనకు జరిగిన నష్టాన్ని పూడ్చమని డిమాండ్ చేసాడు. ఇప్పుడు అలాంటి పరిస్దితే బాలీవుడ్‌లోనూ ఓ చిత్రానికి ఎదురైంది. దాంతో నిర్మాతలు తల పట్టుకునే పరిస్దితి వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు... హృతిక్ రోషన్ తాజా చిత్రం 'కాబిల్'.

ఇద్దరు అంధుల మధ్య సాగిన ప్రేమ కథతో అందంగా తెరకెక్కిన చిత్రం 'కాబిల్'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అందాల భామ యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగులో 'బలం' అనే టైటిల్‌తో విడుదలయ్యింది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సంజయ్ గుప్తా తీసారు. 25 జనవరి 2017న ఈ చిత్రం విడుదల అయ్యింది.

అయితే 'కాబిల్' కి పోటీగా షారూఖ్ ఖాన్ 'రాయీస్' విడుదల అవడడంతో సినిమా నష్టపోయిందని ట్రేడ్‌లో వార్తలు వచ్చాయి. 'కాబిల్' సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలూ వచ్చాయి. అయితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దాంతో వారు నిర్మాత రాకేష్ రోషన్‌ని నష్టపరిహారం కోసం డిమాండ్ చేయటం మొదలెట్టారు. అందుకోసం రోషన్ 15 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించటానికి ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.

కానీ రాకేష్ రోషన్ ఏమంటారంటే... 'కాబిల్' హిట్ సినిమా అని, తాను నష్టపరిహారం చెల్లించే ప్రసక్తే లేదని అంటున్నారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందరికీ 'కాబిల్' ఎంత పెద్ద హిట్టో తెలుసు అని అన్నారు. ఇవన్నీ చూస్తూంటే నిజంగానే ఆయన నష్టపరిహారం ఇవ్వటానికి సిద్ధంగా లేరని అర్థం అవుతోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: