సినిమా పేరు: ఘాజీ
నటీనటులు: రానా.. కె.కె.మీనన్.. అతుల్ కులకర్ణి.. తాప్సి.. ఓంపురి.. నాజర్.. సత్యదేవ్.. భరత్‌రెడ్డి తదితరులు
సంగీతం: కె
ఛాయాగ్రహణం: మది
కూర్పు: శ్రీకర్‌ప్రసాద్
విజువల్ స్టంట్స్: జాషువా
ఎఫెక్ట్స్: ఈవా మోషన్ స్టూడియోస్
నిర్మాణం: పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన - దర్శత్వం: సంకల్ప్
విడుదల: 17 ఫిబ్రవరి 2017
యుద్ధం, దేశభక్తి లాంటివి కమర్షియల్ సినిమాలుగా చూపించాలంటే . బలమైన భావోద్వేగాల్ని చూపించగలగాలి. ‘ఘాజీ’ అలాంటి ప్రయత్నమే చేసింది. చరిత్రలో జరిగిన ఓ సంఘటనని, ఇండియా - పాకిస్థాన్ యుద్ధంలో చాలా మందికి తెలియని మరో కోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇండియన్ సబ్‌మెరైన్ ఎస్ 21కీ, పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య 1971లో జరిగిన జల యుద్ధమే ఈ కథ. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ (రానా), కెప్టెన్ రణ్ విజయ్‌సింగ్ (కె.కె.మీనన్)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? పాక్ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే 'ఘాజీ' సినిమా.
ఇండియా - పాక్ యుద్ధమంటే ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. సముద్రం లోపల జరిగే పోరాటంతో ఒక పకడ్బందీ కథ ఇలా తొలిసారిగా వచ్చింది. దీన్ని తెలుగు – హిందీ భాషల్లో నిర్మించారు. హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు టామ్ క్లేన్సీ నవల ఆధారంగా తీసిన ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ (1990)’ మరియు డెంజెల్ వాషింగ్టన్, జేన్ హేక్‌మేన్ నటించిన 'క్రింసన్ టైడ్ (1995)' సినిమాల్లోని జలాంతర్గాముల యుద్ధం గుర్తుకొస్తే రావొచ్చు.
'ఘాజీ' సినిమాలో సింహభాగం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్ మెరైన్ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే... తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప ఎక్కడా విసుగు అనిపించదు. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. తెరపై ప్రధాన పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కనెక్ట్ చెయ్యడంలో దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సన్నివేశాల్లో, ఘాజీని నాశనం చేసినప్పుడు... దేశభక్తి ఉప్పొంగేలా చిత్రీకరించారు.
అతి తక్కువ పాత్రలతో, ‘యుద్ధం’ అనే ఒకే విషయంతో ప్రేక్షకుల్ని రెండు గంటలు కూర్చోబెట్టడం అనేది పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. కొన్ని చోట్ల నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కాకపోయినా... అవేవీ ఇబ్బందిని కలిగించవు. ప్రారంభంలో కథా నేపథ్య వాతావరణాన్నిఅర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఆ నేపథ్యం అలవాటైన తర్వాత శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో చిత్ర బృందం విజయవంతమైంది.
ఈ సినిమాలో... పాత్రలు తప్ప నటులెవ్వరూ కనిపించరు. రానా ఈ కథని, ఈ పాత్రని ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్ పాత్ర తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. అతుల్ కులకర్ణి కూడా ఎక్సెలెంటే. పాక్ కెప్టెన్ రజాక్ పాత్ర ( రాహుల్ సింగ్) మరో ఆకర్షణ. తాప్సి, ఓంపురి, నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు. మన తెలుగు నటులు సత్యదేవ్, రవివర్మలకు చెపుకోదగ్గ పాత్రలే లభించాయి.
ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విధంగా పనిచేశారు. సాంకేతిక అంశాల పరంగా ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం, ఛాయాగ్రహణం గురించి. కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. కేవలం సంగీతంతోనే మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కలిగించారు. ఇక మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్ సెట్లో.. ఉన్నతంగా చిత్రీకరించాడు.ఇక గుణ్ణం గంగరాజు రాసిన మాటలూ సహజంగా వున్నాయి – ‘పైకీ కిందకీ… పైకీ కిందకీ… ఎవడ్రా వాడు? కమాండరా... లిఫ్ట్ మానా?’ అని రజాక్ పాత్ర అర్చినప్పుడు, ఆ డైలాగుకి హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. డాక్యుమెంటరీ లాంటి కథని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన స్క్రీన్ ప్లేతో ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని పేట్రియాట్రిక్ థ్రిల్లర్ చిత్రంగా మలిచాడు. ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు (విశాఖ తీరంలో జరిగిన కథ కాబట్టి) తప్పక చూడాల్సిన సినిమా ఇది. కాకపోతే యథార్థ కథా నేపథ్య ప్రదేశం విశాఖపట్నం అయినా... దర్శకుడు ఆ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం తెలుగు ప్రేక్షకులకు కాస్త బాధ కలిగించే అంశం. బహుశా... ప్రేక్షకులకు హాలీవుడ్ చిత్రం చూస్తున్న అనుభూతి కలిగించాలనుకున్నారేమో!
Post A Comment: