Om Namo Venkatesaya Telugu Movie Review | Nagarjuna Om Namo Venkatesaya Movie Review Rating | Anushka Om Namo Venkatesaya Telugu Movie Review | Telugu Movie Reviews

చిత్రం పేరు: ఓం నమో వేంకటేశాయ
తారాగణం: నాగార్జున.. సౌరభ్‌జైన్‌.. అనుష్క.. ప్రగ్యాజైస్వాల్‌.. జగపతిబాబు.. విమలారామన్‌.. అస్మిత.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. ప్రభాకర్‌.. రఘుబాబు తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
కథ, మాటలు: జె.కె.భారవి
నిర్మాత: మహేశ్‌రెడ్డి
దర్శకత్వం: రాఘవేంద్రరావు
పతాకం: ఎ.ఎం.ఆర్‌. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
విడుదల: 10 ఫిబ్రవరి 2017

మర్షియల్‌ చిత్రాలతో వెండి తెరను వర్ణ రంజితం చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన ముద్రని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత  వస్తున్నభక్తిరస చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు, దర్శకుడు రాఘవేంద్రరావు వెండితెర మాయాజాలం ఎలా వుందో తెలుసుకుందాం...

బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? మొదలైన విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు. స్వామినే ప్రత్యక్షంగా చూడాలని కలలు కన్న హథీరాం బాబాకు ఆ దేవుడే దిగివచ్చి పాచికలాడే ఘట్టంతో తొలిసగ భాగం పూర్తవుతుంది. మలి సగభాగంలో నిత్య కల్యాణం, నవనీత సేవ, శేషవస్త్రం విశిష్టత తదితర విషయాలన్నింటినీ కథతో ముడిపెడుతూ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు మరింత రక్తి కట్టిస్తాయి. స్వామివారి ఆభరణాలను దోచాడనే నింద హథీరాం బాబాపై పడుతుంది. ఆ నిందను తొలగించుకునేందుకు హథీరాం బాబా ఏం చేశాడు? రాజు హథీరాంబాబాకి పెట్టిన పరీక్ష నుంచి గట్టెక్కించేందుకు సాక్షాత్తూ ఆ స్వామివారే దిగి వచ్చి ఏం చేశారు... అనే విషయాలు అలరిస్తాయి. ఇదొక ఆధ్యాత్మిక చిత్రమే అయినా హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలు మొదలైనవి, భక్తులకు తెలియని ఎన్నో విషయాలను తెరపై చూపించారు. హథీరాంబాబా కథను విసుగు లేకుండా ఆద్యంతం అలరించేలా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

నాగార్జున హథీరాం బాబాగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.  వేంకటేశ్వరుడిగా సౌరభ్‌జైన్‌ చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు-అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు మార్కు కమర్షియల్‌ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు.

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. నేపథ్య సంగీతం కథను గుండెకు హత్తుకునేలా మార్చింది. అయితే అన్నమయ్య, శ్రీరామదాసు పాటల స్థాయిలో 'ఓం నమో వెంకటేశాయ' పాటలు  ఆకట్టుకోవు. తెరమీద ఈ పాటలన్నీ బాగానే వున్నాయి కానీ కదిలించే భక్తి పాట అనేదే కరువయ్యింది.

మొత్తానికి 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు' సినిమాలతో పోల్చలేనప్పటికీ 'ఓం నమో వేంకటేశాయ' కూడా మరో గుర్తుండిపోయే భక్తిరస చిత్రంగా నిలుస్తుంది. భక్తిరస చిత్రాలని ఇష్టపడేవారిని, ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులని ఈ చిత్రం బాగా అలరిస్తుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: