అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో ఈ చిత్రం షూటింగ్ సమయంలో వివాదం తలెత్తింది. చెన్నకేశవ- వైష్ణవ ఆలయంలో శివలింగం, ఇతర శైవాచారాలకు సంబంధించిన సెట్‌లను నిర్మించారు. అదే సమయంలో ఈ చారిత్రక ఆలయంలోకి భక్తులను కట్టడి చేశారంటూ స్థానికులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
‘మేము రాష్ట్ర దేవాదాయ శాఖకు రోజుకు రూ.లక్షన్నర చెల్లించి అనుమతులు తీసుకున్నాం’ అంటూ చిత్ర దర్శక, నిర్మాతలు ఆందోళనకారులకు వివరించారు. వైష్ణవ ఆలయంలో శైవానికి సంబంధించిన సెట్లను వేయటం, భక్తులను అనుమతించకుండా అడ్డుకోవటం సరికాదని స్థానికులు నిరసన తెలిపారు. వారం రోజులుగా పూజలను సైతం నిర్వహించలేకపోతున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ వివాదం ఎప్పటికి క్లియర్ అవుతుందో చూడాలి.
ఇక ముందు ప్రకటించినట్లుగానే కొంతసేపటి క్రితం అల్లు అర్జున్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. నుదుటున విభూతి రేఖలను ధరించి, పంచె కట్టుతో... సైడ్ క్రాఫ్ తో బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఓల్డ్ మోడల్ స్కూటర్ కి కూరగాయల సంచులు తగిలించుకుని వస్తున్నట్టుగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Post A Comment: