మహేష్ – మురుగదాస్ లు కలిసి చేస్తున్న చిత్రంపై ఎన్ని భారీ అంచనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. దర్శకుడు మురుగదాస్ కూడా ఆ అంచనాలను అందుకునేలా సినిమాని హై స్టాండర్డ్స్ లో చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. కానీ చిత్రం మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా టైటిల్, టీజర్, ఫస్ట్ లుక్ అంటూ ఏ ఒక్కదాన్ని కూడా బయటకు వదలకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. సోషల్ మీడియాలో టైటిల్ ఏంటి, టీజర్ ఎప్పుడు అంటూ మురుగదాస్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలా నిరాశలో ఉన్న అభిమానులకు వేరే రూపంలో కాస్త ఉపశమనం దొరికింది.
నిన్న(ఆదివారం) రాత్రి జరిగిన ధరమ్ తేజ్ ‘విన్నర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిధిగా విచ్చేసిన నిర్మాత పివిపి, ఆ చిత్ర ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గురించి మాట్లాడుతూ "ఠాగూర్ మధు ఈ ఏడాది 'మిస్టర్', 'విన్నర్', 'సంభవామి యుగే యుగే' అనే మూడు సినిమాలు చేస్తున్నారు. అన్నీ విజయవంతమవ్వాలి" అన్నారు. ఠాగూర్ మధు కూడా మహేష్ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడం, పివిపి చెప్పిన టైటిల్ మొదటి నుండి ప్రచారంలో ఉండటంతో మహేష్ చేస్తున్న సినిమా టైటిల్ ‘సంభవామి యుగే యుగే’ అని తేలిపోయింది. దీంతో ఫ్యాన్స్ నిన్న రాత్రి నుండి ఈ టైటిల్ ను సొషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Post A Comment: