చిత్రం: గురు
నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్ హుస్సేన్ తదితరులు
మాటలు: హర్షవర్ధన్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: కె.ఏ. శక్తివేల్
కూర్పు: సతీష్ సూర్య
నిర్మాత: ఎస్. శశికాంత్
రచన, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాణ సంస్థ: వై నాట్ స్టూడియోస్
విడుదల తేదీ: 31 మార్చి 2017
గత రెండు నెలలుగా విడుదల వాయిదా పడుతూ పడుతూ మొత్తం మీద ఈ మండుటెండల్లో ప్రేక్షకుల తలుపు తడుతున్న వెంకటేష్ చిత్రం.. ‘గురు’. సుధా కొంగర దర్శకత్వంలో 'సాలా ఖడూస్' పేరిట హిందీలో, 'ఇరుది సుట్రు' పేరుతో తమిళంలో విడుదలైన మాధవన్ చిత్రానికి రీమేకే ఈ 'గురు'. హిందీ బాక్సాఫీస్ వద్ద స్టార్ వేల్యూ లేక తేలిపోయిన ఈ చిత్రం, తమిళంలో మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్‌తో యథాతథంగా రీమేక్ చేసారు.
కథగా చెప్పాలంటే... ఆది(వెంకటేష్)కి బాక్సింగ్ అంటే ప్రాణం. కానీ.. కోపం ఎక్కువ. ఆ కోపంతో, బాక్సింగ్ అకాడమీలోని రాజకీయాలు పడలేక తాను అనుకొన్న లక్ష్యాల్ని సాధించలేకపోతాడు. కోచ్‌గానూ ఆదికి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్ కోచ్‌గా నియమిస్తుంది అకాడమీ. అక్కడ రాములు (రితికా సింగ్) కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తుంటుంది రాములు. అక్క లక్స్ (ముంతాజ్) మాత్రం బాక్సర్‌గా రాణించి తద్వారా పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్‌కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. కానీ రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు, అలాగే ఫెడరేషన్ లో ఉన్నశత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు ? ఏవిదంగా ట్రైన్ చేస్తాడు ? ఎలా వరల్డ్ ఛాంపియన్ ను చేస్తాడు ? అనేదే ఈ సినిమా కథ.
అశ్వని నాచప్ప, భానుచందర్ ప్రధాన పాత్రల్లో మౌళి దర్శకత్వంలో వచ్చిన అశ్వని చిత్రం మెయిన్ థీమ్ కూడా ఈ కథని పోలే వుంటుంది. అయితే అది అథ్లెట్‌కి సంబంధించింది. కొన్ని రాజకీయాల వల్ల ఛాంపియన్ అవ్వలేకపోయిన భానుచందర్ స్టేడియం కీపర్‌గా వర్క్ చేస్తుంటాడు. స్లమ్‌లో వుండే అశ్వని టాలెంట్‌ని గుర్తించి ఆమెను ఛాంపియన్ చెయ్యాలనుకుంటాడు. అదే కథను కొన్ని మార్పులు చేసి గురుగా రూపొందించారు. కథ, కథనం విషయంలో డైరెక్టర్ సుధని తప్పకుండా అప్రిషియేట్ చెయ్యాలి. ఓ పక్క ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ కథని నడిపించడం, వెంకటేష్, రితిక సింగ్‌ల నుంచి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సుధ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది.
ఇది రీమేక్ చిత్రం అయినప్పటికి వెంకటేష్ కోసం కొన్ని మార్పులూ చేర్పులూ చేశామని చెప్పినా... అవి అంత పెద్దగా కనిపించవు. పైగా హిందీలో కనిపించిన నటీనటులే దాదాపుగా ఇక్కడా తారసపడతారు. వెంకటేష్ తప్ప. బాలీవుడ్ సినిమాలో వాడిన కొన్ని షాట్స్ యథాతథంగా ఇక్కడా వాడుకొన్నారు. కాకపొతే కేవలం ‘ఆట’ చుట్టూనే తిరిగిన తొలి తెలుగు సినిమా ‘గురు’ అనే చెప్పాలి. బాక్సింగ్ తప్ప.. మరో ట్రాక్ వినిపించదు.. కనిపించదు. సినిమా అంతా ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం ‘గురు’ ప్రత్యేకత. అయితే ఒక సగటు స్పోర్ట్స్ సినిమాలో వుండే చాలా రొటీన్ వ్యవహారాలు ఇందులోను కనిపిస్తాయి. తను ఇష్టపడే స్పోర్ట్‌లో ఏవో కారణాల మీద ఫెయిల్ అయిన వ్యక్తి కోచ్ అవతారం ఎత్తడం, అతడికి కొన్ని దురలవాట్లు వుండడం, అతనికి తన కలని సాకారం చేసుకునే ఆస్కారం మరో యంగ్ క్యారెక్టర్‌లో కనిపించడం, ఆ యంగ్ క్యారెక్టర్‌కి ఈ ఆట మీద ధ్యాస లేకపోవడం, ఎప్పటికో కానీ కోచ్ విలువ తెలుసుకోలేక పోవడం, చివరకు కీలకమైన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి గెలవడం, అంతకుముందు ఆ కోచ్‌కి అతి పెద్ద పరీక్ష ఎదురు కావడం... ఇలా ఏ స్పోర్ట్స్ సినిమాలో చూసినా రొటీన్‌గా కనిపించే అంశాలతోనే ఈ కథనం రాసుకున్నారు. అయితే ఒక మంచి కథ తాలూకు గొప్పతనం ఏమిటంటే, అప్పటికే చదివేసినా, చూసేసినా ఇంకోసారి చూసేందుకు, చదివేందుకు ఏ అభ్యంతరాలుండవు. ఒరిజినల్ చూసినప్పటికీ, దాదాపు మక్కీకి మక్కీ దించేసిన 'గురు'.. ప్రేక్షకుల్ని లీనం చెయ్యగలిగింది అంటే, అది ఖచ్చితంగా సుధ కొంగర రాసుకున్న కథలోని గొప్పతనమే. అలాగే 'గురు'గా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసిన వెంకటేష్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.
నటనాపరంగా... కోచ్ పాత్రలోవెంకటేష్ ఒదిగిపోయాడు. చాలా కొత్తగా కనిపించాడు. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో వెంకటేష్ రాణించగలడు అని చెప్పడానికి మరో ఉదాహరణ ‘గురు’. వెంకటేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు. సినిమా ఆరంభం నుండి చివరి దాకా ఒకే దూకుడును, బాడీ లాంగ్వేజ్ ను మైంటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ను చూస్తే ఒక నిజ జీవితపు వాస్తవ పాత్ర కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంటుంది.
ఇక వెంకీ శిష్యురాలిగా హీరోయిన్ రితికా సింగ్ నటన కూడా కొత్తగా ఉంటుంది. ఒక తెలుగు సినిమా హీరోయిన్ ని ఈ తరహా పాత్రలో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. స్వతహాగా బాక్సర్ అయిన రితికా ఒక మాస్ నైపథ్యం, అల్లరి ప్రవర్తన కలిగిన అమ్మాయిగా, బాక్సర్ గా చాలా బాగా నటించింది. వెంకటేష్‌తో పోటాపోటీగా నటించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవ్ ఖత్రిగా నటించిన జాకీర్ హుస్సేన్ పెర్‌ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్‌గా, నేచురల్‌గా వుంది. నాజర్, రఘుబాబు, అనితాచౌదరి తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే... కథ పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడడం, వినోదం పేరుతో లేని పోని సన్నివేశాల జోలికి వెళ్లకుండా చాలా స్పష్టంగా, క్లుప్తంగా రాసుకొన్న స్క్రిప్ట్ ఇది. రీమేక్ సినిమాల్లో ఎమోషన్‌ని తర్జుమా చేయడం కష్టం అంటుంటారు. కానీ, ‘గురు’ ఆ కష్టాన్ని దాటుకొచ్చింది. అక్కడక్కడ కళ్లు చెమర్చుతాయి. స్ఫూర్తి రగులుతుంటుంది. కోచ్ పాత్రపై జాలి, ప్రేమ, అభిమానం పొంగుకొస్తుంటాయి. బాక్సింగ్ అంటే ఏమిటి? ఎలా ఆడాలి? పాయింట్లు ఎలా ఇస్తారు? ఇలాంటి వివరణల్లోకి వెళ్లకుండా.. నేరుగా కథ చెప్పేయడం మంచిదే అయ్యింది. లేదంటే అదో డాక్యుమెంటరీగా తయారైపోయేది. దర్శకురాలు ఈ విషయంలో విజయం సాధించింది. డైరెక్టర్ సుధా కొంగర ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ ఫెడరేషన్లో నడుస్తున్న కుళ్ళు రాజకీయాలు, ఇతర వాస్తవ అంశాల ఆధారంగా రాసుకున్న కథ దాన్ని చిత్రంగా మలచడానికి తయారుచేసుకున్న కథనం రెండూ బాగున్నాయి.
శక్తివేలు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ ఎంతో నేచురల్‌గా చూపించాడు. ముఖ్యంగా బాక్సింగ్ పోటీల్లో అతని కెమెరా పనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే.. సినిమా వాతావరణానికి తగ్గట్టుగా సంగీతం అందివ్వడంపై దృష్టి పెట్టాడు. పాటలకంటే నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది. సన్నివేశంలోని గాఢతని సంగీతం తెలియజేసింది. హర్షవర్థన్ రాసిన మాటలు కూడా ఇన్‌స్పైరింగ్‌గా వున్నాయి. వెంకీ పాత్రకు రాసిన డైలాగులు పాత్ర స్వభావాన్నితగ్గట్టు చాలా బాగున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది.
మొత్తానికి... వెంకటేష్, రితికల పెర్‌ఫార్మెన్స్, కథ, కథనాలు, ఆడియన్స్‌ని కట్టి పడేసే ఎమోషన్స్, ఆడియన్స్‌ని టెన్షన్‌కి గురి చేసే క్లైమాక్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, స్లో నేరేషన్, సెకండాఫ్‌లో కొంత సేపు కథ నడవకుండా ఏవో ఒక సీన్ రావడం, కామన్ ఆడియన్ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం మైనస్‌లుగా చెప్పొచ్చు. హిందీ లేదా తమిళ ఒరిజినల్ సినిమా చూసినవాళ్లకు ‘గురు’ ఓకే అనిపించొచ్చు. చూడని వాళ్లకు మాత్రం.. తప్పకుండా నచ్చుతుంది.
Post A Comment: