చిత్రం: కాటమరాయుడు
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, నాజర్, అలీ, రావు రమేష్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు తదితరులు
మాటలు: శ్రీనివాస్‌రెడ్డి
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
కూర్పు: గౌతంరాజు
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: డాలీ
నిర్మాణ సంస్థ: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
విడుదల: 24 మార్చి 2017
ఆరంభం నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకుని ప్రతి దశలోనూ పాటలు, టీజర్, ట్రైలర్లతో అభిమానుల్ని అలరిస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’. తెలుగులోకి 'వీరుడొక్కడే' గా అనువాదమై, విడుదలైన 'వీరమ్' అనే తమిళ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యపరచింది. 'వీరమ్' ఇతివృత్తాన్ని తీసుకుని పవన్ ఇమేజ్‌కి అనుగుణంగా మార్పుచేర్పులైతే చేసారు కానీ 'అవుట్‌డేటెడ్' అయిపోయిన ఆ సబ్జెక్ట్‌ని కొత్తగా మాత్రం ప్రెజెంట్ చేయలేకపోయారు. కొత్తదనం లేకపోయినా కనీసం హీరోని పవర్‌ఫుల్‌గా చూపించి, మాస్‌ని ఎక్సయిట్ చేసే సన్నివేశాలతో నడిపించి వున్నా మిగతాది పవన్ చూసుకునేవాడు.
కథగా చెప్పాలంటే... రాయలసీమలోని ఒక ఊరికి పెద్ద కాటమరాయుడు (పవన్ కళ్యాణ్). ఆ ఊరిలో పేదలను పీడించే ధనవంతులకు ఎదురు నిలుస్తూ పేదల బాగు కోసం పనిచేస్తుంటాడు. కాటమరాయుడుకి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు). వాళ్లంటే రాయుడికి ప్రాణం. పెళ్లి చేసుకుంటే తమ మధ్య గొడవలొస్తాయనే భయంతో అతను పెళ్లి కూడా చేసుకోకుండా ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ అతని నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. దానికి ముందుగా అన్నయ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుని ఆయన్ను అదే ఊరికి పని మీద వచ్చిన అవంతిక (శ్రుతిహాసన్) తో ప్రేమలో పడేలా చేస్తారు. అవంతి ప్రేమ కోసం హింసను పక్కన పెట్టి మామూలుగా మారాలని ట్రై చేస్తాడు రాయుడు. అనుకోకుండా అవంతి ఇంట్లోనే స్థానం సంపాదిస్తాడు. అవంతి ఫ్యామిలీని చంపాలని ఎవరో టార్గెట్ చేస్తున్నారని తెలుసుకుంటాడు రాయుడు. ఆ కుటుంబాన్ని వాళ్ళకి తెలీకుండానే అడుగడుగునా రక్షిస్తుంటాడు. మరి రాయుడు... అవంతిక ప్రేమను పొందగలిగాడా? ఆమెను ఆకట్టుకోవడానికి రాయుడు కత్తిని వదిలిపెట్టాడా? కత్తి పట్టకుండా అవంతి ఫ్యామిలీని శత్రువుల బారి నుండి కాపాడగలిగాడా? అసలు అవంతిక ఫ్యామిలీని టార్గెట్ చేసిందెవరు? అనేది మిగతా కథ.
ఈ సినిమాలో కథ పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ, ఏ ధైర్యంతో ఈ సినిమాని రీమేక్ చెయ్యాలనుకున్నారో అర్థం కాదు. పాత రాయలసీమ కత్తుల కథకి పాత ప్రేమ కథని జోడించి చేసిన ఈ కథను తెలుగులో చాలామంది రైటర్స్‌తో చెక్కించి ఒక రూపం తెచ్చేందుకు ట్రై చేశారు. కానీ కథలోకి లీనం చేసే కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడానికి తోడు బలహీనంగా సాగే కథనం, అంతకంటే బలహీనమైన విలన్స్ ఏ దశలోను కాటమరాయుడు పట్ల ఆసక్తి కలిగించవు. మాస్ సినిమాల్లో, అందునా హీరోది అంతటి పవర్‌ఫుల్ క్యారెక్టరు అయినప్పుడు గుర్తుండిపోయే సన్నివేశాలు కనీసం రెండు, మూడయినా వుంటాయి. ఇందులో రిపీట్ వేల్యూ వున్న సీన్ ఒక్కటీ లేకపోవడం విచిత్రం. స్క్రిప్టు పరంగా ఉన్న బలహీనతల్ని వినోదభరిత సన్నివేశాలతోనో, ఉద్వేగపూరిత సంభాషణలతోనో కవర్ చేయడానికి సహజంగా దర్శకులు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడుతుంటారు. కానీ కాటమరాయుడు బలహీనతలన్నీ పవన్‌కళ్యాణే కవర్ చేసేస్తాడన్నట్టు అతడి మీదే వాలిపోయి కంప్లీట్‌గా పవన్ స్టార్ పవర్ మీదే ఆధారపడిపోయారు. పవన్‌కళ్యాణ్ తన అభిమానుల్ని అయితే అలరిస్తాడు కానీ ఒక సాధారణ స్క్రిప్టుతో మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు శాటిస్‌ఫై చేయగలడు? ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ కథలో కంటెంట్ కూడా ఉండాలనేది ఎందుకు తెలుసుకోరో అర్థం కాదు.
నటనాపరంగా... సినిమాలోని మొదటి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది అనుమానం లేకుండా పవన్ కళ్యాణే. తను రెగ్యులర్‌గా చేసే యూత్‌ఫుల్ క్యారెక్టర్స్‌కి భిన్నంగా మెచ్యూర్డ్‌గా కనిపించిన పవన్ కొత్తగా అనిపిస్తాడు. అతని నటన, హావభావాలు, హాస్య చతురత ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. శృతి హాసన్ తో నడిచే రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించి థియేటర్ మారుమోగిపోయేలా చేశాడు. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించింది. కాకపోతే పాటల్లో డ్యాన్స్‌ల విషయంలో పవన్ మరింత దృష్టి పెడితే బాగుండేది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ రాంగ్ సెలెక్షన్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. శృతిహాసన్ ఎందుకో ఒకింత ఆడ్‌గా కనిపించింది. ఆమె స్టయిలింగ్ కూడా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్రజెన్స్, గ్లామర్, పెర్‌ఫార్మెన్స్.. ఇలా ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది శృతి. పవన్ తమ్ముళ్లుగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, కృష్ణ చైతన్యలు పర్వాలేదనిపించినా అజయ్ మాత్రం చాలా రోజులపాటు గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చూపించాడు. రావు రమేష్ ఒక కొత్త గెటప్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తన డైలాగ్స్‌తో కాసేపు నవ్వించాడు. తరుణ్ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేదు. అలీ, నాజర్, పృథ్వీ వీళ్లంతా ఓకే అనిపిస్తారు. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు
సాంకేతికంగా చూస్తే... డైరెక్టర్ కిశోర్‌కుమార్ తమిళ్‌లో ఆల్రెడీ హిట్ అయిన కథని పవన్‌కళ్యాణ్‌కి అనుగుణంగా, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చేసేందుకు చాలా ట్రై చేశాడు. అయితే కథ పరంగా, కథనం పరంగా ఏ దశలోనూ మనకు కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య, హీరో, హీరోయిన్ మధ్య, హీరో, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వున్నా అవి ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేంత స్ట్రాంగ్‌గా అనిపించవు. కేవలం పవన్‌కళ్యాణ్‌ని దృష్టిలో వుంచుకొని చేసిన కథ కావడం వల్ల మిగతా విషయాల్లో అంతగా కేర్ తీసుకోలేదనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని ఆయన చాలా రియలిస్టిక్ గా, అందంగా చూపించారు.
అనూప్ రూబెన్స్ చేసిన పాటల్లో టైటిల్ సాంగ్, 'లాగే లాగే' పాటలు తప్ప మిగతావి బాగాలేవు. నేపథ్య సంగీతం ఒకింత ఫర్వాలేదు కానీ టాప్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో కేవలం రణగొణ ధ్వనులు తప్ప సంగీతం అనేది వినిపించలేదు. సంభాషణల పరంగాను స్టార్ రైటర్ లేని వెలితి బాగా తెలిసింది. రామ్ లక్ష్మణ్ పోరాటాలని తీర్చిదిద్దిన విధానం బాగుంది. పవన్ తర్వాత ఈ చిత్రానికి ఫైట్లే ప్రధానాకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా శ్రద్ధ తీసుకోవాల్సింది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకుండాల్సిన లుక్ అండ్ ఫీల్ మిస్ అయ్యాయి.
మొత్తానికి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా, ఎంజాయ్ చేస్తూ చేసిన ఈ ‘కాటమరాయుడు’ ఆయన అభిమానులకు పండుగను, మిగిలిన ప్రేక్షకులకు రొటీన్ సినిమాను చూసిన నిరాశను ఇస్తుంది. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా వుండడం వల్ల 'కాటమరాయుడు' ఒక ఏవరేజ్ మూవీగా నిలుస్తుంది.
Post A Comment: