ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజా పేరిట లీగల్‌ నోటీసులు అందాయి. విషయమేంటంటే.. బాలసుబ్రహ్మణ్యం వరల్డ్‌ టూర్‌లో భాగంగా అన్ని దేశాల్లో కచేరీలు ఇస్తున్నారు. ఎక్కువగా ఇళయరాజా పాటలు పాడుతున్నారని, ఇంకెప్పుడూ ఆయన పాటలు పాడకూడదంటూ ఇళయరాజా పేరిట బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు వచ్చాయి. దీనిపై బాలు ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ... ‘అందరికీ నమస్కారం. నాకు ఇళయారాజా వద్ద నుండి రెండు లీగల్ నోటీసులు అందాయి. నాతో పాటు చిత్ర, నా కుమారుడు చరణ్‌కి కూడా నోటీసులు వచ్చాయి. అందులో వివిధ దేశాల్లో శ్రీమతి చిత్ర, చరణ్ లు నిర్వహిస్తున్న కచేరీల్లో తన కంపొజిషన్స్ పాడకూడదని, అలా చేస్తే కాపీ రైట్స్ ని అతిక్రమించినందుకుగాను భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్పీబీ50 పేరుతో మా అబ్బాయి ఈ టూర్ ప్లాన్ చేశారు. నేను ఇప్పటి వరకు రష్యా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశాను. అప్పుడు రాని నోటీసులు అమెరికాలో కచేరీ అనగానే వచ్చాయి. ఆయన చెప్పారు కాబట్టి యూఎస్ టూర్లో ఆయన పాటలను ఆలపించను. కానీ కచేరీ మాత్రం అనుకున్న ప్రకారమే జరుగుతుంది. నేను నాకు మంచి మిత్రుడు అయిన ఇళయరాజాను ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను. నేను మీకొక్కటే విన్నవించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారాలు చేయద్దు. ఇది దేవుడి మహిమే అయి ఉంటే దాన్ని భక్తితో స్వాగతిస్తాను. సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: