సినిమా పేరు: నగరం
నటీనటులు: సందీప్‌కిషన్, రెజీనా, శ్రీ, చార్లీ, రాందాస్, మధుసూదన్, మునీష్‌కాంత్ తదితరులు
సంగీతం: జావేద్ రియాజ్
ఛాయాగ్రహణం: సెల్వకుమార్ ఎస్‌కె
కూర్పు: ఫిలోమిన్ రాజ్
సమర్పణ: అశ్వనికుమార్ సహదేవ్
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాణం: ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పొటెన్షియల్ స్టూడియోస్
విడుదల: 10 మార్చి 2017
చాలా రోజులుగా కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ‘నగరం’ అనే ద్విభాషా సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రిలీజవుతోంది. నలుగురు వేర్వేరు వ్యక్తుల కథలతో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు లోకేష్ ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సమాంతరంగా సాగే నలుగురి కథలు ఒకచోటికి ఎలా చేరతాయి, ఏ విధంగా ముగుస్తాయి అన్నది ఈ చిత్రం ఇతివృత్తం. 'యువ', 'వేదం', 'మనమంతా' తదితర చిత్రాల్లో చూసిన తరహా కథనమే కానీ ఇది చెన్నయ్ క్రైమ్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది.
కథగా చెప్పాలంటే... ఇదీ కథ అని నిర్దిష్టంగా చెప్పలేం. ఎందుకంటే ‘నగరం’ కథ కాదు. కొన్ని సంఘటనలు. సొంత వూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువకుడు, తన వూళ్లొనే ఉంటూ.. చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్న మరో కుర్రాడు, పిల్లాడి ఆపరేషన్ కోసం నగరం వచ్చి, ఇక్కడ ఓ టాక్సీ నడుపుకొంటూ కడుపునింపుకోవాలని చూసే ఓ సగటు జీవి, డాన్ అయిపోదామని ఓ కిడ్నాప్ ముఠాతో చేతులు కలిపిన ఓ అమాయక జీవి... ఈ నలుగురు చేసిన చిన్న చిన్న తప్పిదాలే వాళ్లని పెను ప్రమాదంలో పడేస్తాయి. అవేంటి? అందులోంచి ఎలా బయటపడ్డారు? అనేదే ‘నగరం’ కథ.
సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే చెప్పుకోవలసింది ఆరంభం నుండి చివరి వరకు కొనసాగించబడిన సస్పెన్స్. దీని వలన తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్సుకత కొనసాగింపబడి ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. దర్శకుడు లోకేష్ తను రాసుకున్న మంచి స్క్రీన్ ప్లేని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి కాస్త సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా వివరించాడు. మొదటి భాగం మొత్తాన్ని మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో బాగానే నడిపాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. చిన్న చిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. అలాగే చెన్నై లాంటి మహా నగరంలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్ గా చూపడం బాగుంది.
నటనాపరంగా... ప్రధాన నటీనటవర్గం అంతా బాగా చేసింది. సందీప్ కిషన్ షార్ట్ హెయిర్‌తో టఫ్‌గా కనిపించాడు. శ్రీ అసహాయ యువకుడి పాత్రకి బాగా సూట్ అయ్యాడు. చార్లీ కూడా సహజ నటనతో మెప్పించాడు. రెజీనాకి ఎక్కువ స్కోప్ లేదు కానీ వున్నంతలో బాగానే చేసింది. మధుసూదన్ తన వంతు సహకారం అందించాడు. వినోదం కోసం పెట్టిన కామెడీ కిడ్నాపర్ క్యారెక్టర్ (మునీష్‌కాంత్) ఓవరాక్షన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. బహుశా మరెవరైనా సీజన్డ్ యాక్టర్ అయితే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేసి వుండేవాడేమో.
సాంకేతికంగా చూస్తే... ఛాయాగ్రహణం సినిమా మూడ్‌కి తగ్గట్టు సాగింది. సెల్వకుమార్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పాలి. ఈ సినిమా కథ ఎక్కువ శాతం నైట్ ఎఫెక్ట్‌లో వుంటుంది. చెన్నయ్ నగరాన్ని నైట్ ఎఫెక్ట్‌లో ఎంతో అందంగా, మరెంతో సహజంగా చిత్రీకరించాడు. కథ, కథనాలకు తగ్గట్టుగా, పాత్రల మధ్య వుండే ఎమోషన్స్‌కి అనుగుణంగా చక్కని లైటింగ్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం వుంది. కథలోని ఎమోషన్‌ని, సస్పెన్స్‌ని ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ జావేద్ రియాజ్ చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు ఇలాంటి సినిమాల్ని ఎడిట్ చేయడం చాలా కష్టం. అందులో ఎడిటర్ నేర్పు కనిపించింది. నాలుగు కథల్ని విడి విడిగా చూపిస్తూ చివర్లో మరో ఎలిమెంట్‌తో ఈ కథల్ని జత చేస్తూ ప్రేక్షకులు ఎక్కడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా తన ఎడిటింగ్‌తో మ్యాజిక్ చేశాడు.
సినిమాని ఎంత కొత్తగా ప్రజెంట్ చేసినా ప్రతి సినిమాలోనూ కొన్ని మైనస్‌లు వుంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్‌లు వున్నాయి. సినిమా కథనం బాగానే ఉన్న ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడానికి, కథనంలో కుదురుకునేలా చేయడానికి దర్శకుడు మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇలాంటి వేగవంతమైన కథనం ఉన్న సినిమాల్లో సన్నివేశాలు కూడా వేగంగానే ఉండాలి. కానీ ఇందులో కాస్త సాగదీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి కథనం యొక్క వేగాన్ని కాస్త దెబ్బతీశాయి. అలాగే ఫస్టాఫ్ బాగున్నా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు తోచింది. చివరగా సినిమా ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కథ కొన్ని చోట్ల రిపీట్ అవుతున్నట్టు తోచింది. సన్నివేశాలు, మలుపులు, కో ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉండడం కాస్త గందరగోళానికి గురి చేసే విషయాలే. పైగా సినిమా ఆద్యంతం సీరియస్‌గా సాగుతుంది. ముగింపు అంత ఎఫెక్టివ్‌గా లేదు.
మొత్తానికి, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. రొటీన్ ఫార్ములా చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్‌కి మాత్రం 'నగరం' కొంత నిరాశ కలిగించవచ్చు.
Post A Comment: