ఈ సంవత్సరం టాలీవుడ్ అందుకున్న విజయాల్లో యువ హీరో శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ కూడా ఒకటి. ఈ సినిమాతో హీరోగా శర్వానంద్ స్థాయి పెరిగిందనే చెప్పాలి. అందుకే మంచి మంచి ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన నూతన దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధ’ మార్చి 29 న రిలీజ్ కానుండగా మరో భారీ ఆఫర్ ఒకటి ఆయన చేతుల్లో వాలినట్టు తెలుస్తోంది.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి శర్వానంద్ కు ఇటీవలే ఒక కథ చెప్పారని, శర్వానంద్ కూడా ఆ కథ పట్ల సుముఖంగానే ఉన్నాడని తెలుస్తోంది. ప్రకాష్ కు రాఘవేంద్రరావు తనయుడిగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ... దర్శకుడిగా మాత్రం అస్సలు ఇమేజ్ లేదు. ఆయన తీసిన రెండు సినిమాలూ ఫ్లాపులే. అలాంటి దర్శకుడికి, వరుస విజయాలతో ఊపుమీదున్న శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శర్వానంద్ మొహమాటానికి పోయి ఈ సినిమా ఒప్పుకున్నాడా.. లేక నిజంగానే కథలో దమ్ముందా అనే విషయం సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది.
ఇక్కడ అసలు విశేషమేమిటంటే ఈ ప్రాజెక్టును ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మించనుంది. 'బాహుబలి - ది కంక్లూజన్' సినిమా థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజులకు ప్రకాష్ - శర్వానంద్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక కూడా 'బాహుబలి-2' రిలీజ్ తర్వాతే ఉంటుంది.
Post A Comment: