Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

భిమానాన్ని సొమ్ము చేసుకోవడమంటే ఇదే. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు 'బాహుబలి-2' సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని ఒక దొంగ సంస్థ ఎంచక్కా సొమ్ము చేసుకుంటోంది. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించి డబ్బు కట్టించుకుంటూ, టిక్కెట్‌ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్‌ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

'బాహుబలి-2' సినిమాపై సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనడంతో కొత్తగా www.newtickets.in పేరిట ఒక వెబ్‌సైట్‌ ప్రత్యక్షమైంది. 'బాహుబలి-2' టిక్కెట్లు అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌తోపాటు అమెరికా, ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. సైట్‌లోకి వెళ్లాక సినిమాహాళ్ల పేర్లన్నీ ప్రత్యక్షమవుతూ, సీట్లు కూడా కనిపిస్తున్నాయి. టిక్కెట్లు బుక్‌ చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు చెల్లించగానే ఆ అంశాన్ని నిర్ధారిస్తూ మరుక్షణమే ఫోన్‌కు సందేశం వస్తుంది. ఒక్కో టిక్కెట్‌ రూ.120 చొప్పున అమ్ముతున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని సినిమాహాళ్ల పేర్లన్నీ సైట్లో ఉండటం, ప్రతి ఆటకూ టిక్కెట్లన్నీ ఖాళీగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే చాలా హాళ్లలో టిక్కెట్లు ముందుగానే అమ్ముడై పోయాయి. ఈ వెబ్‌సైట్లో మాత్రం ఇంకా అందుబాటులోనే ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇదంతా అనుమానాస్పదంగానే ఉంది. పైగా సదరు వెబ్‌సైట్‌తో తామెలాంటి ఒప్పందం చేసుకోలేదని ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

దీనిపై మీడియా ప్రతినిధులు తెలంగాణ సీఐడీ సైబర్‌ నేరాల విభాగాన్ని సంప్రదించగా ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఐపీ చిరునామా దుబాయిలో ఉన్నట్లు చూపిందనీ, అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలిందని ఎస్పీ రామ్మోహన్‌ తెలిపారు. కోయంబత్తూర్‌ చిరునామాతో ఈనెల 7న వెబ్‌సైట్‌ నమోదు చేయించారు. ఏడాది కోసం సర్వర్‌ను లీజుకు తీసుకున్నారు. డబ్బు చెల్లింపులకు ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది అమాయకులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు కొనుక్కున్నారు. టిక్కెట్లు పొందినట్లు వారి ఫోన్లకు సందేశాలు కూడా వచ్చాయి. సినిమా విడుదలయ్యాక వారంతా హాళ్లకు వెళ్తే, ఆ టిక్కెట్లు ఎప్పుడో అమ్ముడై ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

టిక్కెట్లు కొనే సమయంలో వినియోగదారుల ఈ-మెయిల్‌ చిరునామా, ఫోన్‌ నంబర్‌ వివరాలు వెబ్‌సైట్‌ నిర్వాహకులకు చేరడం వల్ల భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇలాంటి మోసాలు సర్వసాధారణమయ్యాయనీ, అప్రమత్తంగా ఉండి, నమ్మకమైన వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని, సినిమా టిక్కెట్లు వంటివి కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు వెబ్‌సైట్‌ విశ్వసనీయతను పరిశీలించుకోవాలని సీఐడీ సైబర్‌ నేరాల విభాగం ఎస్పీ రామ్మోహన్‌ సూచించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: