చిత్రం: మిస్టర్
నటీనటులు: వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్,. నాజర్, మురళీశర్మ, తనికెళ్లభరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు
కథ: గోపిమోహన్
మాటలు: శ్రీధర్ సీపాన
సంగీతం: మిక్కి జె. మేయర్
ఛాయాగ్రహణం: కె.వి. గుహన్
కూర్పు: ఎం.ఆర్ వర్మ
నిర్మాతలు: నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి).. ఠాగూర్ మధు
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాణ సంస్థ: లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 14 ఏప్రిల్ 2017
పక్కా మాస్ కథలతోనూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించొచ్చనే విషయాన్ని తన సినిమాలతో చాటి చెప్పి వరుస విజయాలతో 'దూకుడు' మీదున్న దర్శకుడు శ్రీను వైట్లకి 'ఆగడు'తో షాక్ తగిలింది, 'బ్రూస్‌లీ'తో బ్రేక్ పడింది. వరుస పరాజయాల తర్వాత తాను చేసిన ఈ సినిమా కొత్తగా ఉంటుందని, తప్పక ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని శ్రీను వైట్ల చెప్పడంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు పరిశ్రమలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ ఈ 'మిస్టర్' ని చూసాక శ్రీను వైట్ల తీసిన గత రెండు చిత్రాలే బెటర్ అనే భావన కలిగిస్తుంది! ' దమ్ముంటే చివరి వరకు కూర్చోండి చూద్దాం' అంటూ ప్రేక్షకులకి సవాల్ విసురుతున్నారా అనిపిస్తుంది. 'మిస్టర్' సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా బాగాలేదు అనే మాటను చెప్తున్నారంటే సినిమాలో అంత చెత్తగా వున్న అంశాలు ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథగా చెప్పాలంటే... స్పెయిన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త రావు (ఆనంద్)గారి అబ్బాయి చై (వరుణ్‌తేజ్). ఇండియా నుంచి వస్తున్న ప్రియ అనే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్తాడు. అయితే పొరపాటుగా ప్రియను కాకుండా మీరా (హెబ్బా పటేల్)ను రిసీవ్ చేసుకుంటాడు. మీరాను తొలిచూపు లోనే ఇష్టపడతాడు చై. ఆమె మాత్రం ఇండియాలో సిద్ధార్థ్ (ప్రిన్స్) ప్రేమలో ఉంటుంది. స్పెయిన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో మీరా.. చైల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. వచ్చిన పని పూర్తవగానే మీరా ఇండియాకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్పెయిన్‌లో ఉన్న చైకి ఫోన్ చేసి తన ప్రేమ విషయంలో సమస్యలు వచ్చాయని చెబుతుంది. దీంతో ప్రియ సమస్యను తీర్చడానికి చై ఇండియాకి వెళ్తాడు. ఆ క్రమంలో అనుకోకుండా లావణ్య త్రిపాఠి మరియు ఆమె కుటుంబానికి సంబంధించిన పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అలా ఇరుక్కుపోయిన చై ఆ ఇద్దరమ్మాయిల సమస్యల్ని ఎలా తీర్చాడు ? చివరికి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.
ఏమాత్రం ఆసక్తికరంగా లేని కథ, కథనాలతో రూపొందిన 'మిస్టర్' చిత్రంలో చెప్పుకోవడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అంటూ ఏమీ లేదు. గోపీమోహన్ అందించిన నాసిరకమైన కథకి, శ్రీధర్ సీపాన అంతకంటే నాసిరకం డైలాగ్స్ రాశాడు. శ్రీను వైట్ల సినిమాల్లో సింపుల్ కథకి వివిధ త్రెడ్స్‌ని కలుపుకుంటూ ఎంగేజింగ్‌గా సాగే స్క్రీన్‌ప్లే పెద్ద ఆకర్షణ. ఇతర దర్శకులు, రచయితల వల్ల కాని ఆ కాంప్లికేటెడ్ స్టయిల్‌ని వైట్ల మాస్టర్ చేసి వరుసగా బ్లాక్‌బస్టర్లు తీసాడు. కానీ శ్రీను వైట్ల తన మునుపటి టచ్ కోల్పోయాడనేది 'ఊపిరి' స్పూఫ్ చూస్తేనే తెలిసిపోతుంది. అసలు ఆ స్పూఫ్ ఉద్దేశమేంటో అర్థం కాదు. నవ్వించాలని తీసారో, లేక సీరియస్‌గా శ్రీనివాసరెడ్డికి తేజస్వితో లవ్ ట్రాక్ రాసారో కూడా బోధపడదు. నాసిరకమైన స్క్రీన్‌ప్లేతో, డైరెక్షన్‌తో 'మిస్టర్'ని గజిబిజిగా వున్న దారిలోకి తెచ్చాడు శ్రీను వైట్ల. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపైకి వస్తూనే ఉంటాయి. కొత్త కథలు పుడుతూ, ఆ కథల్లోనూ బోలెడన్ని మలుపులు చోటు చేసుకుంటుంటాయి. కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం ఎక్కడా కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలగదు. కథనం కూడా ఏ దశలోనూ రక్తికట్టదు. పిచ్చయ్యనాయుడు (నాజర్) ఆయన ప్రత్యర్థులు గుండప్ప (తనికెళ్ల భరణి) రాహుల్ వడియర్ (నికితిన్ ధీర్) పగ నేపథ్యంతో కథ మొదలవుతుంది. ఆ వెంటనే స్పెయిన్‌లో ఉంటున్న చై దగ్గరికి వెళ్లిపోతుంది. అక్కడి చై కథ, తర్వాత మీరా కథ, ఆ తర్వాత చంద్రముఖి కథ ఇలా వరుసగా ఉప కథలు తెరపై కనిపిస్తూ ఉంటాయి. దాంతో తొలి సగభాగంతోనే మొత్తం సినిమా చూసేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలోనే రైటర్ ఒక చోట డైలాగ్ రాస్తాడు- "కంఫర్స్ట్ పెరిగిపోతే కథలు రాయలేవు, కాలే కడుపుతో జనంలోకి వెళ్తేనే రాయగలవనీ". అక్షరాలా ఇది నిజమని ఈ సినిమానే బలిపెట్టి రుజువు చేశాడు. కంఫర్స్ట్ పెరిగిపోయి రాసిన అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టు ఇది.
నటనాపరంగా... వరుణ్ తేజ్ కెరీర్‌కి ఇదో కొత్త రకమైన కథ. కామెడీ, భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాల్లో ఎక్కువగా నటించాల్సి వచ్చింది. అయితే ఆ సన్నివేశాల్లోనే బలం లేకపోవడంతో అందులో వరుణ్ నటన కూడా తేలిపోయినట్టు కనిపిస్తుంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా, డాన్స్‌ల పరంగా, ఫైట్స్ పరంగా వరుణ్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇక హీరోయిన్లు హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిల పెర్‌ఫార్మెన్స్ గురించి, గ్లామర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ల గ్లామర్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి వెగటు పుట్టేలా ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో కనిపిస్తారు. ఇంతకుముందు సినిమాల్లోనే అంతంత మాత్రంగా కనిపించిన హెబ్బా పటేల్ ఈ సినిమాలో మరింత దారుణంగా కనిపించింది. అందమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో తన మొదటి సీన్ నుంచే చాలా డీ గ్లామర్‌గా కనిపించింది. హీరోయిన్లు ఇద్దరూ వరుణ్ తేజ్ పక్కన తేలిపోయారు. లావణ్య నటనతో మెప్పించినా, హెబ్బా పటేల్ మాత్రం టోటల్‌గా మిస్‌కాస్ట్ అనిపిస్తుంది. ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా కన్విన్సింగ్‌గా కనిపించే టాలెంట్ వున్న మురళిశర్మ కూడా తన పాత్రని రక్తి కట్టించలేకపోయాడు. తెర నిండా పాత్రలు వాటికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఏ పాత్ర కూడా సరిగా పండలేదు. దాంతో మిగిలిన నటీనటుల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు.
సాంకేతికంగా... సినిమాటోగ్రాఫర్ పనితనం ఒక్కటీ మెప్పిస్తుంది. విజువల్స్ రిచ్‌గా వున్నాయి. విదేశాల్లో తీసిన ఎపిసోడ్ కనువిందు చేస్తుంది. ఆ తర్వాత ఇండియాలో తీసిన పార్ట్ మొత్తం చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. చాలా షాట్స్ ఔట్ ఫోకస్‌లో వుండడం మనం గమనించవచ్చు. ఇక హీరోయిన్లను అంత డీగ్లామర్‌గా చూపించడం గుహన్ వల్లే సాధ్యమైందేమో. మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కి జె.మేయర్ ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా చెయ్యలేకపోయాడు. స్పెయిన్‌లో తీసిన పాటలు విజువల్‌గా బాగానే అనిపించినా మ్యూజిక్ పరంగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరేసరి. ఏ సీన్‌లోనూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవ్వలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. కత్తెరకు బాగా పదును పెట్టాల్సింది. ఫస్ట్‌హాఫే గంటన్నర వుండడంతో ఒక సినిమా చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. టోటల్‌గా రెండున్నర గంటల సినిమాలో ఎడిట్ చెయ్యాల్సిన సీన్స్ చాలానే వున్నాయి. ఈ విషయంలో ఎడిటర్‌కి ఫ్రీడమ్ ఇచ్చినట్టు లేదు. అందుకే ప్రేక్షకులకు రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు చాలా రిచ్‌గానే సినిమాని నిర్మించారు.
ఇక దర్శకుడి విషయానికొస్తే... వరుస ఫ్లాపుల తర్వాత కూడా కథ, కథనం వంటి అంశాలను శ్రీను వైట్ల చాలా ఈజీగా తీసుకోవడం బాగోలేదు. కథ, కథనాలు ఒక గమ్యం అంటూ లేకుండా ఎలా పడితే అలా నడపడంతో సినిమా చూడటం కష్టంగా మారింది. అనవసరమైన పాత్రలు ఎక్కువవడం సినిమాకు పెద్ద డ్రా బ్యాక్. కొన్ని ఫన్నీ సన్నివేశాల్ని మినహాయిస్తే శ్రీను వైట్ల పనితనం బిలో యావరేజ్ గా ఉంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎన్నో చెత్త సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో, టెక్నీషియన్స్ నుంచి మంచి ఔట్‌పుట్ తెప్పించుకోవడంలో శ్రీను వైట్ల హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు. తత్ఫలితంగా 'మిస్టర్' అనే సినిమా డిజాస్టర్ మూవీ అయింది.
మొత్తానికి... దర్శకుడు శ్రీనువైట్ల తన పాత చిత్రాల ప్రభావం నుంచి ఇంకా బయట పడలేదని ఈ చిత్రం స్పష్టంగా చాటి చెబుతుంది. కన్‌ఫ్యూజన్ కామెడీ, పేరడి ఇందులోనూ ఉపయోగించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. టోటల్‌గా మిస్‌ఫైర్ అయిన 'మిస్టర్' ప్రేక్షకుల్లో ఏ వర్గాన్ని మెప్పించడమైనా కష్టమే మరి.
Post A Comment: