రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో పాటే మరో కానుకని కూడా అందజేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లూ తన సినిమాల కోసం ఎదురు చూసిన అభిమానులని, ఇకపై వెంట వెంటనే మురిపించబోతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యే యంగ్ డైరెక్టర్, ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రచార చిత్రాన్ని ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో పాటే విడుదల చేయనున్నట్టు సమాచారం. అందుకోసమే ప్రభాస్ కొత్త చిత్రంలోని గెటప్పులోకి మారిపోయారనేది ఫిల్మ్‌నగర్ వర్గాల మాట.
‘బాహుబలి’గా ప్రభాస్ పలు భాషల్లో ప్రాచుర్యం పొందారు. తన మార్కెట్‌నీ విస్తృతం చేసుకొన్నారు. అందుకే ఇకపై తాను చేసే చిత్రాలు తెలుగుతో పాటు, తమిళం, హిందీల్లోనూ విడుదల కావాలనేది ప్రభాస్ ప్రణాళిక. అందుకు అనువుగా ఉండే కథల్ని ఎంచుకోవడంపైనే దృష్టిపెడుతున్నారాయన. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం కూడా అన్ని భాషలకీ సరిపడేలా ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా పేరుపై కూడా చిత్రబృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ ‘సాహో’ అనే పేరుని చలన చిత్ర వాణిజ్య మండలిలో రిజిస్టర్ చేయించింది. అది ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం కోసమే అని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
'బాహుబలి-2’ టైటిల్ సాంగ్ లో ఎక్కువగా వినిపించే ఈ సాహో పదం దాదాపు అన్ని పరిశ్రమల ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. సాహో అనే పదం వినిపిస్తే చాలు జనాలు పాటందుకుంటున్నారు. అంతటి క్రేజ్ ఉంది కనుక ఆ పదాన్నే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారట. తెలుగు, తమిళం, హిందీ భాషలలో రూపొందే ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు', 'ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనుండగా బాలీవుడ్ సంగీత దర్శకత్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీత బాధ్యతలు నిర్వహించనున్నారు.
Post A Comment: