బాలసుబ్రహ్మణ్యం వరల్డ్ టూర్ సందర్భంగా తాను సంగీత దర్శకత్వం వహించిన పాటలను పాడకూడదంటూ ఎస్పీబీకి ఇళయరాజా కోర్టు ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ‘ఎస్పీబీ 50’ వరల్డ్ టూర్‌లో ఉన్న ఆయన ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడారు. ‘నేనూ, ఇళయరాజా ఇప్పటికీ స్నేహితులమే. అయితే ఆయన పంపిన లీగల్ నోటీస్ వల్ల నేను చాలా కలత చెందాను. అయినా వరల్డ్ టూర్ కొనసాగుతుంది. అదృష్టవశాత్తూ ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్‌లను నేను పాడాను. అయినా ప్రేక్షకుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు’ అని అన్నారు.
‘నాకూ ఆత్మాభిమానం ఉంది. ఇళయరాజా కానీ ఆయన ఆఫీస్ నుంచి ఎవరైనా సరే పాటలు పాడవద్దని నాకు సమాచారం ఇస్తే బాగుండేది. ఒక్క ఫోన్‌కాల్ ద్వారా సమస్య అక్కడే పరిష్కారమైపోయేది. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు నుంచే మేమిద్దరం స్నేహితులం. మేం మాత్రమే కాదు. ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలను పాడేందుకే నేను పుట్టానని అందరూ అంటుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇళయరాజా గొప్ప జ్ఞాని. నేనో గొప్ప సంగీత దర్శకుడితో పనిచేశా. మా ఇద్దరి మధ్య విరుద్ధ భావాలు లేవు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుంది’ అని పేర్కొన్నారు.
‘ఒక పాట చాలా మందికి చెందుతుంది. దర్శకుడు సన్నివేశాన్ని చెపుతారు. సంగీత దర్శకుడు అందుకు అనుగుణంగా పాటను కంపోజ్ చేస్తారు. గీత రచయిత మంచి పాటను అందిస్తారు. గాయకుడు పాడతాడు. వాయిద్యకారులు అందించే సంగీతంతో దాన్ని రికార్డు చేస్తారు. ఆ తర్వాత నాయకానాయికలు తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరిస్తారు’ అని వివరించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
ఇటీవల బాల సుబ్రహ్మణ్యం బ్యాగు కూడా చోరీకి గురైంది. అందులో పాస్ట్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులు ఉన్నాయి.
Post A Comment: