సీనియర్ తెలుగు సినీ నటుడు కె.కె.శర్మ (84) గురువారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూనియర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలెట్టి, దాదాపు 500 చిత్రాల్లో నటించారాయన. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కె.కె.శర్మ పూర్తి పేరు కన్నెపల్లి కామేశ్వర శర్మ. స్వస్థలం కాకినాడ. చిత్రసీమకు రాకముందు రైల్వే శాఖలో పనిచేసేవారు. సినిమాలపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్ర రంగంలో స్థిరపడ్డారు. ‘కంచుకోట’ చిత్రంతో ఆయన నట ప్రయాణం ప్రారంభమైంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌కి శ్రీకారం చుట్టి పలుచిత్రాల్లో తన సహజమైన నటనతో ఆకట్టుకొన్నారు. 'మయూరి', 'స్త్రీ' వంటి చిత్రాల్లో ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కొంతమంది మిత్రులతో కలసి ‘గోల నాగమ్మ’ అనే చిత్రాన్నీ నిర్మించారు.
ఏడిద నాగేశ్వర రావు, హరనాథ్, విజయ్ చందర్, వీబీ రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులతో కలిసి అనేక నాటకాలు వేశారు శర్మ. గురు ప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గురించి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చిన బృందంలో శర్మ శాశ్వత సభ్యునిగా వుండేవారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో శర్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Post A Comment: