రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ ప్రభంజనంతో ఒక భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కాగా, ఆ ఘనత సాధించిన తొలి దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి చరిత్రకెక్కారు. ఇంకా పలు దేశాల్లో చిత్రం విడుదలవనుంది. దీన్నిబట్టి భవిష్యత్తులో ఈ వసూళ్ళ అంకెలు మరింత ఘనంగా ఉండబోతున్నాయనే విషయం అర్థమవుతోంది. ‘బాహుబలి 2’ విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల పరంపర మొదలు పెట్టింది. దీని ధాటికి ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి... అవుతూనే ఉన్నాయి. ఆ జాబితాలో మచ్చుకు కొన్ని ఇవి...
* టికెట్ల ముందస్తు బుకింగ్ ద్వారానే ‘బాహుబలి 2’కు రూ.36 కోట్లు వసూళ్లొచ్చాయి. ఈ విషయంలో ‘దంగల్’ (రూ.18 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది.
* ఇండియాలో అత్యధిక తెరల్లో (6 వేలకు పైగా) విడుదలైన చిత్రంగా నిలిచింది. గతంలో ‘సుల్తాన్’ (4350 తెరలు) పేరిట ఉన్న రికార్డు తుడుచుపెట్టుకుపోయింది.
* తొలిరోజు థియేటర్లలో సీట్ల భర్తీ విషయంలోనూ సత్తా చాటింది. 95 శాతం సీట్ల భర్తీ సాధించింది.
* తొలిరోజు వసూళ్ల విషయంలో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. రూ.121 కోట్ల తొలి రోజు వసూళ్లతో ‘బాహుబలి 2’ గతంలో ‘బాహుబలి’(రూ.50 కోట్లకు పైగా) పేరిట ఉన్న రికార్డును దాటేసింది.
* తొలిరోజే రూ.100 కోట్లు సాధించిన ఏకైక చిత్రం ‘బాహుబలి 2’. ‘బాహుబలి’కి అది సాధించడానికి రెండు రోజులు పట్టింది.
* హిందీ అనువాద చిత్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా (రూ.41 కోట్లు) నిలిచింది.
* విడుదలకు ముందు అమెరికాలో ముందుస్తు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం (2.5 మిలియన్ డాలర్లు). ఈ విషయంలో ‘ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’, ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ లాంటి హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కు నెట్టేయడం విశేషం.
* ఇండియాలో రెండో రోజు వసూళ్ల విషయంలోనూ అగ్రస్థానం దీనిదే. రెండో రోజు రూ.102 కోట్లు సాధించింది.
* అత్యంత వేగంగా రూ.200 కోట్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే. రెండు రోజుల్లోనే ఈ ఘనత సాధించి ‘సుల్తాన్’ (ఏడు రోజులు) రికార్డును అధిగమించేసింది.
* ఇంతటితో ఆగలేదు. రూ.300 కోట్లు, రూ.400 కోట్లు.. ఇలా రూ.800 వందల కోట్ల వరకు అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
* రూ.900 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్‌లను ప్రారంభించిన చిత్రమిదే.
* తొలి వారాంతంలో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రం. ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలోనే రూ.526 కోట్లు వచ్చాయి.
* ఒక్క హిందీ వెర్షన్ ద్వారానే తొలి వారాంతంలో రూ.128 కోట్లు సాధించింది.
* అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం. ఆరు రోజుల్లోనే అక్కడ 12.6 మిలియన్ డాలర్లు సాధించింది.
సినిమా సృష్టిస్తున్న సంచనాల్ని గమనిస్తున్న ట్రేడ్ వర్గాలు సమీప భవిష్యత్తులో ఈ రికార్డుల్ని అధిగమించే సినిమాని వూహించడమే కష్టం అంటున్నారు.
Post A Comment: