తెలుగు సినిమా రొమ్ము విరుచుకు నిలబడే గొప్ప క్షణాల్ని‘బాహుబలి 2’ రూపంలో అందించాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. భారతీయ వెండితెరపై ఓ గొప్ప రికార్డును ‘బాహుబలి’ పేరిట లిఖించాడు . వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన ‘బాహుబలి 2’ వెయ్యికోట్ల రూపాయల మైలురాయిని పదిరోజుల్లోనే చేరింది. రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. విడుదలై పదిరోజులైనా ‘బాహుబలి’ వేడి కొంచెం కూడా తగ్గలేదంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు. ఇదే రీతిన బాక్సాఫీసు వద్ద బాహుబలుడి జోరు కొనసాగితే రూ.1500 కోట్ల మార్క్‌ను చేరుకోవడం నల్లేరుపై నడకే అంటున్నారు సినీ విశ్లేషకులు.
బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి 2’ సృష్టిస్తున్న రికార్డుల పట్ల ఆ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం ఇన్ని రికార్డులు బద్దలుకొడుతుందని, ఇంతటి చరిత్ర సృష్టిస్తుందని ముందు వూహించలేదు. బద్దలుకొట్టడానికే రికార్డులు ఉంటాయని నేననుకుంటాను. రికార్డులు సృష్టించడంలో, వాటిని బద్దలుకొట్టడంలో ఓ సరదా ఉంది. ఓ తెలుగు సినిమా సరిహద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది. పరభాష ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు, దర్శకుడు లేకపోయినా దృశ్యకావ్యం లాంటి కథతోనే ఇది సాధ్యమైంద’’న్నారు.
"'బాహుబలి 2’ చూసి మూడు రోజులైంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాను కానీ ‘బాహుబలి’ సినిమా నుంచి బయటకు రాలేకపోయాను. ‘బాహుబలి' కేవలం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కాదు. ‘పెద్ద కలలు నెరవేరాలంటే ఎక్కువ కష్టపడాలి. అప్పుడు ఎలాంటి లక్ష్యాన్నైనా సాధిస్తావు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు.. నువ్వు ఎవరు అనేది అసలు విషయమే కాదు’ అని 'బాహుబలి' నిరూపించింది. అద్భుతమైన కథ, కథనాలు, విజువల్ ఎఫెక్ట్స్, దిమ్మతిరిగే నటన, అందమైన శిల్పంలా చెక్కిన జక్కన్న పర్‌ఫెక్షన్.. ఇవన్నీ ఈ చిత్రాన్ని సీట్ చివర్లో కూర్చొని చూసేలా చేశాయి. ఈ సినిమా చూసి ఎన్నిసార్లు క్లాప్స్‌కొట్టానో నాకే తెలియదు. చాలామంది కల కనే సాహసం చేయలేని లక్ష్యాన్ని సాధించిన రాజమౌళికి హ్యాట్సాఫ్’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్వీటారు.
‘బాహుబలి’ లాంటి ఓ గొప్ప చిత్రాన్ని తనకు అందించినందుకు రాజమౌళికి, ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరించినందుకు అభిమానులకూ ధన్యవాదాలు తెలిపారు ప్రభాస్. ప్రస్తుతం అమెరికా విహార యాత్రలో ఉన్న ఆయన ‘బాహుబలి 2’ విజయంపై ఫేస్‌బుక్‌లో ఉద్వేగంగా స్పందించారు. ‘‘నాపై ఇంతటి ప్రేమ కురిపించిన నా ప్రతి అభిమానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇండియాలోని అన్ని ప్రాంతాల నుంచే కాదు... విదేశాల నుంచీ మీరు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారు. మీ అభిమానంతో తడిసిముద్దయ్యాను. ‘బాహుబలి’ కోసం సదీర్ఘ ప్రయాణం చేశాను. అందులో నేను గుర్తుంచుకొనే కొన్ని మధురమైన అనుభూతుల్లో మీ అభిమానం కూడా ఒకటి’’ అని పోస్ట్ చేశారు ప్రభాస్. రాజమౌళి గురించి చెబుతూ ‘‘తను కలగన్న ఓ మహా దృశ్యకావ్యాన్ని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నాపై సంపూర్ణ విశ్వాసముంచిన రాజమౌళికి ధన్యవాదాలు. జీవితకాలానికి ఒక్కసారే దక్కే బాహుబలి లాంటి అరుదైన పాత్రను ఇచ్చి నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలిపినందుకు ఆయనకు కృతజ్ఞత అనే మాట కూడా సరిపోద’’న్నారు ప్రభాస్.
Post A Comment: