మహిళలే తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బటర్ ఫ్లైస్’. సినిమా చిత్రీకరణ శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. జ్యోత్స్న, హర్షిణి, రోజా, సుప్రజ, మేఘన, ప్రవల్లిక ప్రధాన పాత్రధారులు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. ఫణిరాజ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్‌నిచ్చారు. నటి, దర్శకురాలు జీవిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నల్లమిల్లి సామ్రాజ్యలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళుతున్నారనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మహిళా ఇతివృత్తంతో, అంతా మహిళలే నటిస్తున్న చిత్రమిది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఈ సినిమా నమోదవ్వాలని..ఆస్కార్‌ని సొంతం చేసుకోవాలనేది నా కల. మహిళల గౌరవాన్ని పెంచుతూ అశ్లీలం, అసభ్యతకి తావు లేకుండా చిత్రాన్ని తీస్తున్నాం. నిర్మాతగా నాకిది 91వ చిత్రం. ఈ నెల 22 నుంచి నాలుగైదు రోజులు చిత్రీకరణ జరుపుతాం. వచ్చే నెల్లో 40 రోజులు జరిపే షెడ్యూల్‌తో పూర్తి చేస్తామ’’న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘మహిళలు తలెత్తుకునే సినిమా ఇది. ఈ కథ నచ్చి అమెరికా నుంచి వచ్చిన డా॥ జ్యోత్స్న కీలకపాత్రను పోషిస్తున్నారు. నా కుమార్తె ప్రవల్లిక ఓ పాత్రలో నటిస్తోంది. నా సోదరి డా॥గీత ఒక పాట రాసి పాడారు. ప్రత్యోదన్ చక్కని బాణీలను స్వరపరిచార’’న్నారు. జీవిత మాట్లాడుతూ ‘‘మహిళల గౌరవాన్ని పెంచేదని నిర్మాత చెప్పడంతోనే ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చాన’’న్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. సమస్యలు ఎదురైనా పరస్పరం సమన్వయంతో పరిష్కరించుకోవాలి. నంది పురస్కారాల్ని ప్రవేశపెట్టి 50 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా త్వరలో ఓ వేడుక జరపబోతున్నాం. మహిళలపై చరిత్రలో నిలిచేపోయే చిత్రం తీస్తోన్న రామసత్యనారాయణను అభినందిస్తున్నా. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల’’న్నారు.
Post A Comment: