చిత్రం: గౌతమ్‌నంద
నటీనటులు: గోపీచంద్.. హన్సిక.. కేథరిన్.. తనికెళ్ల భరణి.. ముఖేష్ రుషి తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్
కూర్పు: గౌతరరాజు
కళ: బ్రహ్మ కడలి
నిర్మాతలు: జె.భగవాన్, పుల్లారావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది
విడుదల తేదీ: 28 జులై 2017
హీరో గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సంపత్ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మించిన చిత్రం 'గౌతమ్‌నంద'. గతేడాది గోపీచంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ‘గౌతమ్‌నంద’ సినిమా ఆయన కెరీర్‌కి చాలా కీలకం. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? సంపత్ నందిపై గోపీచంద్ పెట్టుకొన్న అంచనాలు నిజమయ్యాయా? 'ధనం మూలం ఇదమ్ జగత్' అనే పాయింట్‌పై ఈ సినిమా తీసిన సంపత్‌నంది ఈ చిత్రంలో చూపించిన కొత్తదనం ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రపంచంలోని టాప్ బిలీనియర్లలో ఒకరైన కృష్ణమూర్తి కొడుకు గౌతమ్ (గోపీచంద్). అతనికి డబ్బు తప్ప ఏ ఎమోషన్స్ తెలీవు. అల్ట్రా మోడ్రన్ జీవితం. సుఖాల్లో మునిగి తేలుతుంటాడు. ఓ సంఘటన అతనిలో మార్పు తీసుకొస్తుంది. తానెవరో తెలుసుకోవాలన్న కోరిక పుట్టిస్తుంది. సుఖాల్ని.. సంపదను వదిలేసి తన గురించి తాను తెలుసుకోవడానికి ఓ ప్రయాణం మొదలెడతాడు. ఆ సమయంలోనే తనలాంటి పోలికలున్న మరో వ్యక్తి కనిపిస్తాడు. అతను పేదరికంలోంచి వచ్చినోడు. డబ్బుల్లేక ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు. అలా రెండు విభిన్న నైపథ్యాలు కలిగిన గౌతమ్, నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళతారు. అలా గుర్తింపు మార్చుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? వాళ్ళ కొత్త పరిస్థితులు వాళ్ళను ఏ విధంగా మార్చాయి ? చివరి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి ? అనేదే ఈ సినిమా కథ.
దర్శకుడు సంపత్ నంది సినిమా చివర్లో బలమైన మలుపు, ముగింపు ఇచ్చినా ఓవరాల్ కథను చూసినట్టైతే పాతదే. ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటారు. ఒకరి స్థానంలోకి ఒకరు వెళతారు. తరువాత ఆ ఇద్దరి జీవితాల్లో ఏమి జరుగుతుంది? అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ చూస్తోన్న కథే. ఆ పాయింట్‌కి 'డబ్బు' అనే మరో ఎక్సయిటింగ్ ఎలిమెంట్ జత చేస్తే కొత్తదనం వచ్చేస్తుందని అనుకున్న సంపత్ నంది, అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోయాడు. సాధారణంగా ఒక పాత కథను చెప్పాలనుకున్నప్పుడు ప్రేక్షకుడు అది పాత కథే కదా అనే నిరుత్సాహంలోకి వెళ్లిపోయేలోగా కథనంలో రెండు మూడు బలమైన మలుపుల్ని లేదా ఇంకేదైనా బలమైన ఎలిమెంట్ మీద సినిమాను నడిపి వాళ్ళ దృష్టిని మళ్లించి పాత కథే అయినా కొత్తగా, ఎంటర్టైనింగా చెప్పారు అనుకునేలా చేయాలి. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదు. అందుకే సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది.
నటన:
రిచ్ కుర్రాడిగా గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగుంది. రెండు విభిన్న పాత్రల్లో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయనకు ప్రయోగాలకు తగిన హీరో అనే కొత్త ఇమేజ్ ను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. కథానాయికల పాత్రలకు కాస్త ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. ముఖేష్ రుషి నటన, అతనికి రాసిన డైలాగులు, చెప్పిన డబ్బింగ్ డెబ్బయ్‌ల కాలం నాటి విలన్‌ని తలపిస్తాయి. భరణి.. చంద్ర మోహన్‌తో ఇలా అందరూ సీనియర్లే కావటంతో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.
సాంకేతికత:
దర్శకుడు సంపత్ నంది పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు కానీ పర్వాలేదనిపించే ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను బాగానే హ్యాండిల్ చేసి మొత్తానికి సినిమాను గట్టెక్కించే పనితనం కనబర్చారు. చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు తోచింది. అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా బలమైన రొమాంటిక్ ట్రాక్ నడపలేడపోయాడు దర్శకుడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్ బాగున్నా అవసరానికి మించి ఎక్కువైనట్టు తోచాయి. కథనం కన్నా స్టైలీష్ మేకింగ్‌పై దృష్టి పెట్టాడు దర్శకుడు. దాంతో తెరపై ప్రతీ దృశ్యమూ కనుల పండుగలా కనిపిస్తుంది.
సినిమాటోగ్రఫర్ సౌందర్ రాజన్ కెమెరా పనితనం చాలా బాగుంది. సినిమాని బాగా లావీష్‌గా చూపించింది అతని కెమెరా. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి మించిన అవుట్‌పుట్‌నే తీసుకొచ్చాడు. కలర్ గ్రేడింగ్, ఎఫెక్ట్స్ వగైరా కూడా బాగానే వున్నాయి. ఇక థమన్ సంగీతం రెండు పాటల వరకే బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మాణ విలువలు సినిమా స్థాయిని బాగా పెంచాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చు అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకాక్ ఎపిసోడ్లు ఆకట్టుకొంటాయి.
మొత్తం మీద చెప్పాలంటే... గోపీచంద్, సంపత్ నందిలు కలిసి చేసిన ఈ ప్రయత్నం పర్వాలేదనించే స్థాయిలో ఉంది. లాజిక్కులు లేకపోవడం, నిరుత్సాహపరిచే రొటీన్ మేకింగ్ ను తట్టుకుంటే ‘గౌతమ్ నంద’ను చూడొచ్చు.
Post A Comment: