తమిళ నటుడు రమేష్ ‘జిత్తన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. తర్వాత ‘జిత్తన్ 2’లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నండు ఎన్ నన్బన్’. రమేష్‌కు జోడీగా పూనంకౌర్ నటిస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్, చాందినీ సంతానభారతిలు ఇతర తారాగణం. ఎస్‌ఎన్ అరుణగిరి సంగీతం అందిస్తున్నారు. ‘ఆసామి’, ‘ఇన్నారుక్కు ఇన్నారెండ్రు’ చిత్రాల దర్శకుడు ఆండాల్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళంలో ఏనుగు, పశువు, మేక, వానరం, పాముల నేపథ్యంలో పలు సినిమాలొచ్చాయి. అంతెందుకు ఇటీవల ఈగ నేపథ్యంలోని సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. తొలిసారిగా ఓ పీత నేపథ్యంలో వైవిధ్యమైన సినిమాను రూపొందిస్తున్నాం. అప్పుడప్పుడు బీచ్‌కు వెళ్లే కథానాయికకు అక్కడి తీరంలో ఓ పీతతో స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు తన ప్రియుడు కనిపించలేదని కథానాయిక పీతకు చెప్పుకుంటుంది. ఆ ప్రియుడిని కనిపెట్టడం కోసం పీత చేసే సాహయ ప్రయత్నమే మిగిలిన కథ. ‘ఈగ’ చిత్రంలో విలన్‌పై ఈగ పగతీర్చుకుంటుంది. అదేమాదిరిగానే ఈ చిత్రం కూడా ఉంటుంది. పలు గ్రాఫిక్ సన్నివేశాలున్నాయి. ‘ఆసామి’ చిత్రంలో నకిలీ స్వామీజీల విషయాలను గుట్టురట్టు చేశా. ‘ఇన్నారుక్కు ఇన్నారెండ్రు’లో మద్యం సమస్యలను చెప్పా. అదేవిధంగా ఇందులో కూడా ఓ సందేశం ఉంది’ అని దర్శకుడు వివరించారు.
Post A Comment: