సూపర్ స్టార్ మహేష్‌బాబు ఒకప్పుడు ఒక సినిమా పూర్తి చేసాకే, కొత్త సినిమా మొదలెట్టేవారు. మధ్యలో ఓ వారం రోజులు విరామం తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్‌గా రంగంలోకి దిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంత టైమ్ లేకుండా ఒక చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ‘స్పైడర్’లో నటిస్తూనే, మరో పక్క ‘భరత్ అను నేను’ మొదలుపెట్టారు. మహేష్‌కి కొత్తగా ఎవరైనా దర్శకుడు కథ చెప్పాలనుకొంటే ఇంకో యేడాది వరకు ఆగాల్సిందే! ఎందుకంటే మహేష్ ముందుగానే కథలకి పచ్చజెండా వూపేశారు.
‘భరత్ అను నేను’ పూర్తయిన వెంటనే, జనవరి మాసం నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం రంగంలోకి దిగుతారు మహేష్. ఆ సినిమా పూర్తయ్యాక రాజమౌళితో సినిమా ఉంటుందని సమాచారం. మహేష్‌బాబు-రాజమౌళి కలయికలో తప్పని సరిగా ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ఆ మేరకు ఇద్దరితోనూ ఒప్పందం కుదుర్చుకొన్నారు. పైగా రాజమౌళి కూడా మహేష్‌తో సినిమా చేయాలనే నిర్ణయించారు. ప్రస్తుతం ఆ కథకి సంబంధించిన పనుల్లోనే ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి మహేష్ కొత్త కథల గురించి యేడాది తర్వాతే ఆలోచిస్తారనిపిస్తోంది. ఆ తర్వాత కూడా చాలా మంది అగ్ర దర్శకులు మహేష్‌తో సినిమా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లాంటి దర్శకులు ఆ జాబితాలో ఉన్నారు.
Post A Comment: