ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయే నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆమిర్ ఖాన్ నటించిన ‘సర్ఫరోష్’లోని చిన్న పాత్రతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. అనేక కష్టాలకు ఓర్చి.. కృషి, పట్టుదలతో ఇప్పుడు ప్రముఖ నటుడిగా ఎదిగారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు తన జేబులో ఒక్క రూపాయి లేని రోజులు కూడా ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చెప్పారు. ‘నా జీవితంలో ఇప్పటికే చాలా చూశాను. నా జేబులో ఒక్క రూపాయి కూడా లేని రోజులున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే రెండు మూడేళ్లు ఉన్నా. ఒక స్నేహితుడి దగ్గర మధ్యాహ్నం తింటే, మరో స్నేహితుడి దగ్గర రాత్రి భోజనం చేసేవాడిని. ఇంకో స్నేహితుడు సిగరెట్ తీసుకొచ్చేవాడు’ అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ముంబయికి రూ. 2,500లతో వచ్చా. ఇప్పుడు నా చేతిలో ఉన్నదంతా పోయి కేవలం రూ.2,500 మిగిలినా అది నా ఓటమిగా భావించను. నేను దేనికీ భయపడను. దాదాపు 12 సంవత్సరాలు ఎదురుచూశాను. ఇది నేను ఎంచుకున్న రంగం. ఇక్కడే ఉండి ప్రయత్నించాలి అనుకున్నా. అన్ని బాధలు భరించి నటుడ్ని కావాలన్న నా కలను చేరాలనుకున్నా. కానీ ముంబయి వదిలి వెళ్లిపోవాలి అనుకున్న సమయం కూడా ఉంది’ అని చెప్పారు.
Post A Comment: