మురుగదాస్ కథలు ఎక్కువగా సామాజికాంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ కథల్లోనే హీరోయిజాన్ని చొప్పిస్తుంటారు. ఇప్పుడు వైద్య రంగం నేపథ్యంలో ‘స్పైడర్’ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలిసింది. సన్నివేశాల్ని ఎక్కువగా ఆస్పత్రుల నేపథ్యంలో తెరకెక్కించడం, ఈ చిత్రంలో కథానాయిక కూడా మెడికో కావడంతో సినిమా కథ వైద్య రంగం చుట్టూ సాగే అవకాశాలున్నాయని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఎప్పట్నుంచో సెట్స్‌పై ఉన్నప్పటికీ కథ, పాత్రల గురించి చాలా గోప్యత పాటిస్తూ వచ్చింది చిత్రబృందం. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయని సమాచారం.
‘స్పైడర్’కి సంబంధించి మరొక్క పాట మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే ఆ పాటని తెరకెక్కించబోతున్నారు. రహస్యాల్ని ఛేదించే ఓ ఇంటెలిజెన్స్ అధికారిగా మహేష్ ‘స్పైడర్’లో సందడి చేయబోతున్నాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది కాబట్టి, ఇక ఈ సినిమా సందడి మొదలు కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతోంది కాబట్టి మహేష్ పెద్ద యెత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ‘స్పైడర్’ సినిమాతో మహేష్ మార్కెట్టు ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Post A Comment: