ప్రముఖ కథానాయిక ప్రియమణి పెళ్లి చేసుకొంది. ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త ముస్తఫారాజ్‌తో ప్రియమణి వివాహం బుధవారంనాడు బెంగళూరు బనశంకరిలో జరిగింది. ప్రియమణి- ముస్తఫారాజ్ స్నేహితులు. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు గత జులైలో జయనగర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం జేపీనగరలో వివాహ విందును ఇవ్వబోతున్నట్టు ప్రియమణి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ వివాహానికి అభిమానులను ఆహ్వానించలేకపోతున్నానని, వివాహానంతరమూ తాను సినిమాలు చేస్తానని ప్రియమణి గతంలోనే వెల్లడించారు.
బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందిన ప్రియమణి ‘ఎవరే అతగాడు’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో విజయవంతమైన కథానాయికల జాబితాలో చేరారు. నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితర అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ప్రియమణి తమిళం, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది.
Post A Comment: