సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 2010లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రోబో’. దర్శకుడు శంకర్ ఊహాశక్తికి, ప్రతిభకు యావత్ సినీ ప్రపంచం జేజేలు పలికింది. చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన, స్టైల్ గురించి వేరే చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్ వస్తున్న చిత్రం ‘2.0’. అమీజాక్సన్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్‌కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. వినాయకచవితి పండగను పురస్కరించుకుని చిత్ర బృందం ‘మేకింగ్ ఆఫ్ 2.0’ వీడియోను అభిమానులతో పంచుకుంది.
సినిమా కోసం సెట్ వేయడంతో ప్రారంభమైన వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. మేకింగ్ వీడియో చూస్తుంటే అసలు సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా? అన్న ఆసక్తి కలగకమానదు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లకు మేకప్ వేస్తున్న దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న తీరు చూస్తుంటే ఆ సన్నివేశాలు విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్దుకుంటే ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Post A Comment: