మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ భారీ చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సైరా’ అనే టైటిల్ తో ‘నరసింహారెడ్డి’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న మోషన్ పోస్టర్ ను టీమ్ అద్భుతంగా డిజైన్ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఓ కోట శిఖరంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా.. దాని చుట్టూ బ్రిటిషు సైనికుల శవాలు.. కోట బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ దృశ్యాలతో ప్రచార చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఆయన ముఖం కనపడలేదు. ‘సై.. సైరా నరసింహారెడ్డి’ అనే నినాదాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించాయి. కుప్ప కూలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుర్తుచేస్తూ, రేనాటి సూర్యుడి పౌరుషాన్ని, వీరత్వాన్ని, అప్పటి ప్రజల్లోని తిరుగుబాటు తీవ్రతను కళ్ళకు కట్టే విధంగా ఉన్న మోషన్ పోస్టర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతను రేకెత్తిస్తోంది.
ఈ మోషన్ పోస్టర్ అభిమానులు, ప్రేక్షకులు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంది. అలాగే నిర్మాత రామ్ చరణ్ కూడా మేకింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఈ చిత్రం విజువల్ వండర్ గా సినిమా ఉండేలా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా నయనతారను తీసుకోవడానికి చిత్ర బృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Post A Comment: