మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షురూ అయ్యింది. మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (06 డిసెంబర్ 2017) మొదలైంది. కీలకమైన పోరాట ఘట్టంతో చిత్రీకరణని ప్రారంభించారు. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వేసిన ప్రత్యేకమైన భారీ సెట్‌లో చిరంజీవిపై తెరకెక్కిస్తున్న ఆ పోరాట ఘట్టానికి హాలీవుడ్‌కి చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్ లీ విట్టేకర్ నేతృత్వం వహిస్తున్నారు.
బుధవారం ఆరంభమైన చిత్రీకరణ ఈ నెల 22 వరకు ఏకధాటిగా జరుగుతుంది. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార నటించబోతోంది. మరో ఇద్దరు కథానాయికలకి చోటున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిర్మాత రామ్‌చరణ్ సమక్షంలోనే తొలి రోజు చిత్రీకరణ జరిగింది.
Post A Comment: