అఖిల్ హీరోగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. కల్యాణి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను డిసెంబరు 22న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున బుధవారం విలేకరులతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు. విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘‘హలో’ డిసెంబరు 22న విడుదల కాబోతోంది. టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది మాలో ఉత్సాహాన్ని నింపింది. ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్, ఫేస్‌బుక్.. ఇలా మొత్తం కలిపి 8 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఆడియోను డిసెంబరు 10న వైజాగ్‌లో విడుదల చేయాలి అనుకుంటున్నాం. అఖిల్‌కు గట్టిగా చెప్పా.. స్టూడియోలో పాడటం కాదు లైవ్‌లో పాడాలని. అంతేకాదు పాటకు డ్యాన్స్ చేయాలని కూడా చెప్పా. సరే అన్నాడు, సాధన చేస్తున్నాడు’. ‘ఈ సినిమాను చాలా బాధ్యతగా తీసుకున్నా. దాదాపు 8-9 నెలలు స్క్రిప్ట్‌పై పనిచేశాం. ఇది ఒక అద్భుతమైన రొమాంటిక్ కథ. హీరో 15 ఏళ్లుగా హీరోయిన్ నుంచి ‘హలో’ అనే మాట కోసం ఎదురుచూస్తుంటాడు. టీజర్‌ను యాక్షన్‌తో విడుదల చేసినా, యాక్షన్‌తో కలిసిన ప్రేమకథ ఇది. సినిమా అంతా చూశా.. బాగుందని చాలా నమ్మకంతో చెబుతున్నా. నిజంగా సంతోషంగా ఉంది. అఖిల్ కూడా రెండేళ్ల నుంచి ఓ మంచి సినిమా తీయాలని, కష్టపడి నటించాడు. సినిమా చూస్తే అతడి శ్రమ తెలుస్తుంది’.
‘‘హలో’లో ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్‌గా నటించింది. తను చక్కగా చేసింది. అఖిల్ తల్లిదండ్రులుగా జగపతిబాబు, రమ్యకృష్ణ కనిపిస్తారు. బాబ్ బ్రౌన్ అనే స్టంట్ డైరెక్టర్‌ను హాలీవుడ్ నుంచి తీసుకొచ్చాం. దాదాపు 30 రోజులు యాక్షన్ ఎపిసోడ్‌లు చేశాం. తెలుగు స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్‌ను చూసి ఉండరు. కొన్ని చోట్ల ప్రేక్షకుడికి జాకీచాన్ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తొస్తాయి’ అని ఆయన చెప్పారు.
అనంతరం ‘మనం’ సినిమాకు అవార్డుల గురించి మాట్లాడుతూ.. ‘‘మనం’ అనేది నాన్నగారి చివరి సినిమా. దాన్ని అందరూ ఎంతో ప్రేమించారు. అదే మాకు ఆస్కార్. మాకు అవార్డులు అవసరం లేదు’ అని నాగ్ (నవ్వుతూ) పేర్కొన్నారు. విక్రమ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విక్రమ్ ‘హలో’ తర్వాత మరో సినిమా తీసి.. ఆపై చైతుతో సినిమా మొదలెడుతాడని నాగ్ అన్నారు.
Post A Comment: