సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.0’. శంకర్ దర్శకుడు. అమీ జాక్సన్ కథానాయిక. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర పోషించారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా, 2017లోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదలను 2018 జనవరికి వాయిదా వేశారు. అప్పటికి కూడా సినిమా పనులు పూర్తికావని భావించిన నిర్మాతలు ఏప్రిల్‌కు విడుదలను వాయిదా వేశారు. ‘2.0’ విడుదల ఇన్ని సార్లు వాయిదా పడటం ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.
అయితే ఈ సినిమా విడుదల వాయిదాకు అమెరికాకు చెందిన వీఎఫ్‌ఎక్స్ సంస్థ కారణమట. ‘2.0’ వీఎఫ్‌ఎక్స్ పనులను నిర్మాతలు అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ చెప్పిన సమయానికి సినిమాను అప్పగించలేకపోయింది. దీంతో నిర్మాతలు ఆ సంస్థపై దావా (లాసూట్) వేసినట్లు సమాచారం. అకాడమీ అవార్డు సొంతం చేసుకున్న ఈ వీఎఫ్‌ఎక్స్ సంస్థ తమని మోసం చేసిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారట.
3డీ వెర్షన్‌లో ‘2.0’ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ సినిమా టీజర్‌ను, మార్చిలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Post A Comment: