విక్రమ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ‘హలో’ చిత్రంతో మంచి విజయం అందుకున్న అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అఖిల్‌కు, వెంకీకి మధ్య గొడవలు వచ్చాయని, దాంతో సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
ఈ విషయంపై స్పందిస్తూ అఖిల్, వెంకీ వెల్లడిస్తూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించారు. ఆ వీడియోను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో వెంకీ, అఖిల్ సీరియస్‌గా ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కన్పించారు. ఆ విషయాన్ని ఇద్దరూ ఒకేసారి చెప్పబోతుండగా అఖిల్ మధ్యలో ఆగి..‘మీరే కదా డైరెక్టర్ మీరు చెప్పండి’ అన్నారు. దానికి వెంకీ స్పందిస్తూ..‘హీరో కదా మీరే చెప్పండి’ అన్నారు.
దాంతో అఖిలే అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. ‘వెంకీకి నాకు క్రియేటివిటీ విషయంలో విభేదాలు వస్తున్నాయట. కానీ తను దర్శకుడు కాబట్టి ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను. నాకు ఈయనకు గొడవ జరిగిందని వస్తున్న వార్తలన్నీ నిజమే అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.’ అని సీరియస్‌గా వెల్లడిస్తూ.. ఒక్కసారిగా ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత షాట్ రెడీ అనగానే అఖిల్ వెంకీకి ముద్దుపెట్టడం దానికి ఎలా స్పందించాలో తెలీక వెంకీ అటూ ఇటూ చూడటం నవ్వులు పూయిస్తోంది.
తమ గురించి వస్తున్న వదంతుల్లో ఏమాత్రం నిజం లేదు అని స్పష్టం చేయడానికే అఖిల్, వెంకీ కలిసి ఈ సరదా వీడియోను రూపొందించారు.
Post A Comment: