మార్వెల్ కామిక్స్ తీసుకొచ్చిన సూపర్ హీరో పాత్రల్లో ‘డెడ్‌పూల్’ ఒకటి. 2016లో తొలిసారి వెండితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన ‘డెడ్‌పూల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. టైటిల్ రోల్ పోషించిన నటుడు రియాన్ రేనాల్డ్స్ ఆ పాత్రలో అదరగొట్టేశాడు. దానికి సీక్వెల్‌గా డేవిడ్ లీఇట్చ్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డెడ్‌పూల్2’. తొలి భాగాన్ని మించి యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ చిత్రం కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.
రెండో భాగంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. కామిక్ పాత్రల్లో ఒకటైన వానిషర్‌గా ఆయన కనిపించారు. సినిమా మొత్తంలో ఈ పాత్ర అదృశ్యంగానే ఉంటుంది. అయితే ఒక్కసారి మాత్రం ఆ పాత్ర తెరపై కనిపిస్తుంది. అలా కనిపించిన పాత్రను బ్రాడ్ పిట్ పోషించారు. ఆయన తెరపై కనపడగానే అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగింది. మరి ఈ పాత్రలో కనిపించినందుకు బ్రాడ్ పిట్ ఎంత తీసుకుని ఉంటారోనని సినీ జనాలను ఓ ప్రశ్న తొలిచేస్తుంది కదా! ఈ విషయాన్నే రేనాల్డ్స్ ఇటీవల వెల్లడించాడు.
ఇంతకీ అతిథి పాత్ర కోసం బ్రాడ్ పిట్ ఏం అడిగాడో తెలుసా? ‘డెడ్‌పూల్’ పాత్ర పోషించిన హీరో రియాన్ రేనాల్డ్స్ స్టార్‌బక్స్ నుంచి స్వయంగా కాఫీ తెచ్చి ఇవ్వాలని కోరాడట. అదే తనకు ఇచ్చే పారితోషికం అని చెప్పాడట. ‘‘బ్రాడ్‌పిట్ అలా అడగానే నాకు భలే సరదాగా అనిపించింది. కేవలం ఒక కప్పు కాఫీ మాత్రమేనా అని ఆయన్ను నేను అడిగా. ‘ఇందులో నేను చేసింది ఏముంది’ అని ఆయన ధోరణిలో సరదాగా చెప్పేశారు’’ అని రియాన్ చెప్పారు.
Post A Comment: