విజయ్‌సేతుపతి, త్రిష కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘96’. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఓ జంట ప్రేమ గురించి చెప్పే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘పసంగ’, ‘సుందరపాండియన్’, నడువుల కొంజం పక్కత్త కానోం’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ప్రేమ్‌కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అలనాటి హాస్యనటుడు జనకరాజ్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన 'అగ్ని నచ్చతిరం' (తెలుగులో 'ఘర్షణ') చిత్రంలో "నా భార్య ఊరెళ్ళిపొయిందో!" అంటూ అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించటంతో పాటు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రంలో నటించిన జనకరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
గత కొన్నిరోజులుగా ‘96’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్రిష, విజయ్ సేతుపతి కెరీర్‌లోనే ఇది ఉత్తమ చిత్రంగా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా విజయ్‌సేతుపతి నటించారు. జాను అనే పాత్రలో త్రిష కనిపిస్తారు. కాళివెంకట్, ఆడుగలం మురుగదాస్‌లు ఇతర తారాగణం. ఈ చిత్రం కోసం త్రిష, విజయ్ సేతుపతి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అసురవధం’తో పాటు పలు సినిమాలకు సంగీతం అందించిన గోవింద్ మేనన్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.
Post A Comment: