బాలీవుడ్ నటీమణులు జూహీ చావ్లా, దీపికా పదుకొణె తదితరులు కొన్ని కన్నడ సినిమాల్లో నటించి, మెప్పించారు. దీపిక కర్ణాటకకు చెందిన వారైనా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఐతే ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలుగు చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’కు కన్నడ రీమేక్‌గా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘సీతారామ కల్యాణం’. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. రచితా రామ్ కథానాయిక.
శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తళుక్కుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2016లో నిఖిల్ ‘జాగ్వార్’ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కన్నడతోపాటు తెలుగు భాషలోనూ విడుదలైన ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో తమన్నా నటించారు.
Post A Comment: