Saheb Biwi Aur Gangstar 3 movie review | Bollywood Movie Review | Saheb Biwi Aur Gangstar 3 review | SBG3 Movie Review |Saheb Biwi Aur Gangstar 3 Hindi cinema review | Saheb Biwi Aur Gangstar 3 Film Review | SBG3 Review | Cinerangam.com Movie Reviews

చిత్రం: సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3
నటీనటులు: సంజయ్ దత్. జిమ్మీ షేర్గిల్. మహీ గిల్, చిత్రాంగదా సింగ్, సోహా అలీ ఖాన్, నఫీసా అలీ, జాకీర్ హుస్సేన్, కబీర్ బేడీ, దీపక్ తిజోరీ తదితరులు
రచన: సంజయ్ చౌహాన్ - తిగ్మాంశూ ధూలియా
సంగీతం: రాణా మజుందార్
ఛాయాగ్రహణం: అమలేందు చౌదరి
బ్యానర్: జే ఏ ఆర్ పిక్చర్స్
నిర్మాత: రాహుల్ మిత్
దర్శకత్వం: తిగ్మాంశూ ధూలియా
విడుదల తేదీ: 27 జులై 2018

ర్శకుడు తిగ్మాంశూ ధూలియాకి 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ - 1, 2' చిత్రాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఈ పరంపరని ఇంకా కొనసాగిస్తూ ఐదేళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో ఇప్పుడు సీక్వెల్ తీశాడు. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ -2’ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నించి అదే ఆదిత్యా ప్రతాప్ సింగ్ కథని సీక్వెల్ గా కొనసాగించాడు. సీక్వెల్ లో ఈసారి ‘సంజు’ ఫేమ్ సంజయ్ దత్ జాయినయ్యాడు. డార్క్ మూవీ జానర్లో సంస్థానాల్లో జరిగే కుట్రలు కుహకాలని ఈసారి రష్యన్ రూలెట్ అనే మృత్యుక్రీడని జోడించి తీశాడు. అయితే ఆ మృత్యు క్రీడ ప్రేక్షకులతో ఆడుకున్నట్టయ్యింది.

ప్రకాష్ ఝా రాజకీయాల్లో మహాభారతాన్ని చూపిస్తున్నానని చెప్పి, 2010 లో బోలెడు పాత్రలతో ‘రాజనీతి’ అనే బక్వాస్ చాటభారతం తీసి చంపినట్టే, ధూలియా కూడా సంస్థానం కథంటూ లెక్కలేనన్ని పాత్రలతో చావగొట్టి వదిలాడు. ఫస్టాఫ్ అంతా ఎవరెవరో పాత్రల పరిచయాలతోనే, వాళ్ళ ఉప కథలతోనే సరిపోతుంది. ఏం చూస్తున్నామో అర్ధంగాని గందరగోళం ఏర్పడుతుంది. నిద్రపోయి లేచినా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే కథ ఎంతకీ ప్రారంభమే కాదు. ఒక సీనుకి ఇంకో సీనుకీ సంబంధమే వుండదు. అసలు ఏ సీను ఎందుకొస్తోందో అంతేబట్టదు. ఇంటర్వెల్లో లండన్ నుంచి సంజయ్ దత్ వస్తేగానీ కాస్త కదలిక రాదు. వచ్చాక సెకండాఫ్ లో వున్న కథ కూడా అంతంత మాత్రమే. కేవలం క్లయిమాక్స్ లో రష్యన్ రూలెట్ ని చూపించి థ్రిల్ చేయడానికి తప్ప, ఇంకో సదాశయం పెట్టుకుని ఈ సీక్వెల్ తీయాలనుకున్నట్టు లేదు. పావుగంట రూలెట్ క్లయిమాక్స్ కోసం రెండుంపావు గంటల సినిమాని భరించాలి. విచిత్రమేమిటంటే, ఇంత అవకతవక సినిమాలో క్లయిమాక్సే, దాంతో ముగింపే సీట్లకి కట్టేసి కూర్చోబెడుతుంది.

క్లయిమాక్స్ తప్ప సినిమాని ఏ కోశానా ఎంతగా పట్టించుకోలేదంటే, ఐదేళ్ళ తర్వాత తీసిన ఈ సీక్వెల్ కనీసం దీని ముందు భాగంలో జరిగిన కథేమిటో రీక్యాప్ కూడా వేయలేదు. గత సీక్వెల్ చూడని ప్రేక్షకులకి, ఈ సీక్వెల్లో ఆదిత్యా ప్రతాప్ సింగ్ జైల్లో ఎందుకున్నాడో అర్ధం గాదు. అతడి భార్య ఎమ్మెల్యే ఎప్పుడయిందో అస్సలర్ధంగాదు.

రష్యన్ రూలెట్ రివాల్వర్ తో ఆడే ఆట. ఐదు గ్లాసుల్లో నీరు, ఒక గ్లాసులో వోడ్కా వుంటుంది. ఏ గ్లాసులో వోడ్కా వుందో గుర్తుపట్టి తాగని వ్యక్తి రివాల్వర్ తలకి పెట్టుకుని మీట నొక్కుకోవాలి. రివాల్వర్ లో వుండే ఆరు ఛాంబర్స్ లో ఒకటే తూటా వుంటుంది. అది ఏ ఛాంబర్లో వుందో తెలీదు. ఒకరి తర్వాత ఒకరు తలకి పెట్టుకుని మీట నొక్కుకునే క్రమంలో ఎవరి చేతిలోనో పేలవచ్చు. అప్పుడు చావడమే. ఎదుటి వాడు గెలవడమే. అమెరికాలో ప్రత్యర్దుల మధ్య మెక్సికన్ స్టాండాఫ్ ప్రతిష్టంభన కూడా ఇలాటిదే. కాకపోతే ఇద్దరి చేతుల్లో గన్స్ వుంటాయి. ఎవరు ముందు పేలిస్తే వాడు బతికి పోతాడు.

లండన్లో ఈ రష్యన్ రూలెట్ స్పెషలిస్టు ఉదయ్ ప్రతాప్ సింగ్ (సంజయ్ దత్). ఉత్తర ప్రదేశ్ లో ఒక సంస్థానానికి చెందిన ఇతను తల్లిదండ్రులని (నఫీసా అలీ, కబీర్ బేడీ) వదిలేసి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఇంకో సంస్థానానికి చెందిన ఆదిత్యా ప్రతాప్ సింగ్ (జిమ్మీ షేర్గిల్) జైల్లో వుంటాడు. అతడి భార్య మాధవీ దేవి (మహీ గిల్) ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేస్తూంటుంది. ఆమె కన్నీ దుష్టాలోచనలుంటాయి. రెండో భార్య రంజన (సోహా ఆలీఖాన్) తాగుడుకి అలవాటుపడి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. ఒకరోజు మాధవీ దేవి ఆమెని కాల్చి చంపి ఆత్మహత్యగా సృష్టిస్తుంది. ఇక భర్త మిగిలాడు. అతను బయటి కొస్తే తన జీవితమిలా వుండదు. మళ్ళీ బానిసలా బతకాలి. అందుకని భర్తని బెయిలు మీద విడిపించి చంపే పథకమేస్తుంది. కానీ ఈలోగా భర్తతో గర్భవతి అవుతుంది. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉదయ్ ప్రతాప్ సింగ్ పరిచయంతో ఆమె పథకానికి ఒక రూపు వస్తుంది. ఏ మగాణ్ణయినా ఇట్టే బుట్టలో వేసుకోగల ఆమె ఉదయ్ ని ఆకర్షించి తన వూరు రప్పించుకుంటుంది. అక్కడ భర్తని చంపే ఆలోచన చెప్తుంది. ఆదిత్యతో ఉదయ్ కీ ఒక వైరం వుంటుంది. దాంతో అతణ్ణి రష్యన్ రూలెట్ ఆటలోకి దింపి చచ్చేలా చేయాలనుకుంటాడు. మరోవైపు అతడి పూర్వ ప్రేయసి సుహానీ (చిత్రాంగదా సింగ్) ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు.

ఈ రూలెట్ ఆటకి సన్నాహం, అతిధుల రాక, ఆట తీరూ మాత్రం పకడ్బందీగా వుంటాయి. కావాల్సినంత సస్పన్స్ ని సృష్టిస్తాయి. దీని ముగింపేమిటన్నది కూడా అనూహ్యంగా వుంటుంది. భార్య చేసిన కుట్ర ఆదిత్యకి తెలిసిపోతుంది. అయితే అతను చంపబోతే, ఆమె తెలివిగా కడుపులో వున్న నీ బిడ్డని కూడా చంపుకుంటావని చెప్పి ప్రాణాలు దక్కించుకుంటుంది. అప్పుడతను అంటాడు – నువ్వు కన్నాక, ఆ బిడ్డ ముందు నిన్ను నించోబెట్టి కాల్చి చంపుతానని. దీనికేం మంత్రమేసిందామె? రూలెట్ క్రీడ దాకా ఎంత అవకతవకగా సాగి నరకయాతన పెట్టినా, ఈ క్రీడతో, దీనికిచ్చిన ముగింపుతో చచ్చినట్టూ మనం ఒక సలాము చేసి రావాల్సిందే.

నటనలో సాహెబ్ గా జిమ్మీ షేర్గిల్ తర్వాతే గ్యాంగ్‌స్టర్ గా సంజయ్ దత్. రంగులు మార్చే బీవీగా మహీ గిల్ కి అందరికంటే ఎక్కువ మార్కులివ్వచ్చు. సెక్సీ చిత్రాంగదా సింగ్ వండర్ఫుల్.

టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. ముఖ్యంగా అమలేందు చౌదరీ ఛాయగ్రాహణం – వాడిన రంగులు, కాంతులు. మూడు పాటలూ బావున్నాయి. లొకేషన్స్, భవనాలూ, కళాదర్శకత్వం కళాత్మకతని ప్రదర్శిస్తాయి. కానీ ఇంత ఔన్నత్యంతో కూడా ఫస్టాఫ్ ని చూడలేం. ధూలియా విషయం పట్టకుండా నిర్లక్ష్యంగా తీసిన సినిమా ఇదొక్కటే.

―సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: