బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషాకు హిందీలో కంటే దక్షిణాది సినిమాలతోనే గుర్తింపు వచ్చింది. ‘అఖిల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయేషా సైగల్.. ఇటీవల విడుదలైన ‘చినబాబు’ చిత్రంలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న సాయేషా సైగల్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. అలనాటి అగ్ర నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ యానిమేషన్ పాత్రకు జోడీగా ఆమె నటించనున్నారు.
తమిళంలో ‘కిళక్కు ఆఫ్రికా విల్ రాజు’ అనే సినిమా తెరకెక్కుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేషన్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో యానిమేటెడ్ ఎంజీఆర్ పాత్రకు జోడీగా సాయేషా నటించబోతున్నారు. ఈ విషయాన్ని సంబంధితర వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. ఎంజీఆర్ స్నేహితుడైన ఇషారి వెలన్ కుమారుడు ఇషారి కె.గణేశ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘నా తండ్రి చనిపోయినప్పుడు ఎంజీఆర్ మా కుటుంబానికి అండగా నిలిచారు. మాకు చాలా సాయం చేశారు. అందుకే ఆయన రుణం తీర్చుకోగలిగేలా ఏదన్నా చేయాలనుకున్నాను. అందుకే ఆయనపై మోషన్ పిక్చర్ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. అయితే ఈ సినిమా ఆయన జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నది కాదు. ఆయన అభిమానులు ఎంజాయ్ చేయగలిగేలా ఇందులో బైక్ రేస్‌లు, ఫైటింగ్ సన్నివేశాలను రూపొందిస్తున్నాం.’ అని వెల్లడించారు నిర్మాత గణేశ్.
ఎంజీఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Post A Comment: