ఒక సినిమా విజయవంతమవ్వడానికి కథ ఎంత ముఖ్యమో కథనం కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కథ అనేది ఎలా ఉన్నా కేవలం రసవత్తరమైన కథనంతోనే విజయం సాధించిన సినిమాలెన్నో! కానీ కొద్ది కాలంగా వస్తున్న తెలుగు సినిమాలు ఏవి చూసినా (ఒకటీ అర మినహాయించి) కథా వస్తువుతో సంబంధం లేకుండా లోపభూయిష్టమైన స్క్రీన్‌ప్లే చట్రంలో ఇరుక్కుపోయి ప్రేక్షకుల నుంచి తిరస్కారానికి గురవుతూ... అలాంటి సినిమాలపై పెట్టుబడి పెట్టిన వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఇలాంటి అపజయాలకు కారణం కొత్తగా వస్తున్న చాలామంది దర్శకులు, రచయితలకు స్క్రీన్‌ప్లే రచనపై కనీసపు పరిజ్ఞానం కొరవడటమే. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా తెలుగులో స్క్రీన్ రైటింగ్‌కి సంబంధించిన సమాచార లభ్యత చాలా తక్కువ. అందుకే కొంత మేరకైనా ఆ లోటును భర్తీ చెయ్యడానికి మీ 'సినీరంగం.కామ్' కొత్త శీర్షికను ప్రారంభిస్తోంది.
స్క్రీన్ రైటింగ్ గురించి శాస్త్రీయంగా మరియు క్షుణ్ణంగా తెలిసిన మనకున్న అతి కొద్ది మంది తెలుగు రచయితలలో సికిందర్‌గారు ఒకరు. ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్ అయిన సికిందర్ గారు సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. తెలుగు సినిమాలకు రచనా సహకారం అందించటంతో పాటు 'ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం' లో 'క్రైమ్ స్టోరీ' శీర్షికన రచనలు చేస్తుంటారు. వీరు నిర్వహించే 'సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ' అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
మరింతమంది సినీ ఔత్సాహికులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆయన బ్లాగులోని అంశాలను 'సినీరంగం.కామ్' పాఠకులకు కూడా అందించాలని సంకల్పించి సికిందర్ గారిని సంప్రదించగా... వెంటనే అంగీకరించి అనుమతిని ఇవ్వడమే కాకుండా శుభాకాంక్షలు కూడా తెలియచేసారు. అందుకు ఆయనకు 'సినీరంగం.కామ్' కృతజ్ఞతలు తెలియచేస్తోంది.
ఇకపై సినిమా రివ్యూలతో పాటు 'కథనరంగం' శీర్షికన స్క్రీన్/స్క్రిప్ట్ రైటింగ్‌కి సంబంధించిన విషయాలను, విశ్లేషణలను మన 'సినీరంగం.కామ్'లో అందించటం జరుగుతుంది. మీ స్పందనలను 'కామెంట్స్' ద్వారా తెలియచేయగలరు.
Post A Comment: