దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి ‘పురట్చితలైవి’ జయలలిత జీవిత చరిత్రను భారతిరాజా తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జయ’ బయోపిక్‌ను రూపొందించే విషయంలో పలువురు పోటీ పడుతున్నారు. విబ్రి మీడియా బ్యానరుపై ఏఎల్ విజయ్ ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్రవర్గాలు ఇటీవలే అధికారికంగా ప్రకటించాయి. జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. మరో వైపు మిష్కిన్ సహాయకురాలు ప్రియదర్శిని కూడా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సెప్టెంబరు 20వ తేదీన ప్రకటించనున్నారు.
ఈ రెండు సినిమాలు ఓ వైపు ఉండగా.. తాజాగా భారతిరాజా కూడా ఈ పోటీలోకి దిగారు. ‘అమ్మ.. పురట్చి తలైవి’ అనే పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆదిత్య భరద్వాజ్ నిర్మించనున్నారు. పై రెండు చిత్రాలు ఫిబ్రవరిలో ప్రారంభం కానుండగా భారతిరాజా సినిమా మాత్రం డిసెంబరులోనే సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జయలలిత పాత్రలో నటించే విషయంపై అనుష్క లేదా ఐశ్వర్యారాయ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఎంజీఆర్‌గా కమల్‌హాసన్ లేదా మోహన్‌లాల్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Post A Comment: