Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

తెలుగు సినీ దర్శకురాలు బి.జయ(54) గురువారం (30 ఆగష్టు 2018) రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. మన తెలుగు ఇండస్ట్రీలో మగ డైరెక్టర్లతో పాటు, లేడీ డైరెక్టర్లు కూడా ఉన్నప్పటికీ, చెప్పుకోదగ్గ దర్శకురాళ్లలో ఎక్కువగా వినిపించేపేరు విజయ నిర్మల గారు. ఇక ఆ తరువాత కొంతవరకు వినిపించే పేరు బి జయ. వేల సినిమాలకు పీఆర్వోగా పనిచేసి, సినిమా ప్రముఖుల మన్ననలు అందుకుంటున్న ప్రముఖ పీఆర్వో మరియు ప్రముఖ మ్యాగజైన్ అధినేత బిఏ రాజు గారి భార్య.

మొదటినుండి ఏదో సాధించాలనే పట్టుదలతో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మరియు సైకాలజీ డిగ్రీలు చేసిన బి. జయ, పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించి..తర్వాత ఆంధ్రజ్యోతి సినీ వార పత్రికకు కొన్నాళ్ళు సంపాదకురాలిగా పని చేశారు. ప్రస్తుతం 'సూపర్‌ హిట్‌' అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు. దర్శకత్వం పట్ల ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగేశారు. 2003లో తొలిసారి 'చంటిగాడు' సినిమాను దర్శకత్వం చేసి తనను తాను నిరూపించుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత 'ప్రేమికులు', 'గుండమ్మగారి మనవడు', 'సవాల్‌', 'లవ్లీ'..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన 'వైశాఖం' ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం.

ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. ఆమె స్వయంగా తన చిత్రాలను తానే ఎడిటింగ్‌ చేసుకుంటారు. తెలుగు సినీ రంగంలో తొలి మహిళా ఎడిటర్‌గానూ ఖ్యాతి గడించారు. ఆమె మరణం నిజంగా టాలీవుడ్ కి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

జయ గారి మరణం పట్ల సినీరంగం.కామ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మరియు బిఏ రాజుగారికి ఆ భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: