విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ‘యన్.టి.ఆర్’ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నారు. ఈ రోజు (20 సెప్టెంబర్ 2018) ఏఎన్నార్ 94వ జయంతిని పురస్కరించుకుని సినిమాలోని ఏఎన్నార్ లుక్‌ను సుమంత్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు.
‘ఈ రోజు ఏఎన్నార్ 94వ జయంతి. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. సినిమాలో ఇది నా లుక్’ అంటూ సుమంత్ ట్వీట్ చేశారు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయారు. అదే తలకట్టు, కళ్లజోడుతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. సుమంత్ ఏఎన్నార్ గెటప్ లో, అచ్చం ఏఎన్నార్ లానే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లేటప్పుడు సుమంత్ తన తాతగారు వాడిన ఆఖరి కారులోనే సెట్స్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన దగ్గుబాటి రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Post A Comment: