Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు. అతను కథగా మారితే... కథానాయకుడు! అతనే ఓ చరిత్ర అయితే... మహానాయకుడు!’ చరిత్రాత్మకమైన ఆ ప్రస్థానాన్ని రెండు భాగాలుగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు క్రిష్‌. ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా పదిహేను రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మొదటి భాగం టైటిల్ ను చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా రెండో భాగం టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’గా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలవుతుంది. రెండో భాగం ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’గా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు క్రిష్‌. తొలి భాగం ఎన్టీఆర్‌ బాల్యం, సినీ ప్రస్థానం నేపథ్యంలో సాగితే... రెండో భాగం రాజకీయం ప్రధానంగా సాగుతుంది.

ప్రతిష్ఠాత్మకమైన ఈ చిత్రం కోసం బాలకృష్ణ నిర్మాతగా మారారు. ఎన్‌.బి.కె. ఫిలిమ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఆరంభించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనతో పాటు సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొంటున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, నిత్యమేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం, నాలుగు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు రోజులుగా దివిసీమ ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: