సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’ భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైంది. సినిమా విడుదల తేదీని అభిమానులు ఓ పండుగలా జరుపుకొన్నారు. ముందుగా ఊహించినట్లుగానే ఈ చిత్రం తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తెలుగులో ఇప్పటివరకు విడుదలైన రజనీ సినిమాల్లో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక తమిళనాడులోని చెన్నై నగరంలో రూ.2.64 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు అక్కడ ఏ చిత్రం కూడా తొలిరోజు ఇంతటిస్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. విజయ్ నటించిన ‘సర్కార్’ విడుదలైన తొలిరోజు చెన్నై నగరంలో రూ.2.37 కోట్లు రాబట్టింది. పండుగ సమయంలో కాకుండా సాధారణ పనిదినాల్లో విడుదలైనప్పటికీ ‘2.ఓ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. కర్ణాటకలో ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.8.25 కోట్లు. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.
ఇక ఓవర్‌సీస్ విషయానికొస్తే.. అమెరికాలో ‘2.ఓ’ చిత్రం 265 ప్రదేశాల్లో విడుదలైంది. తొలిరోజు రాత్రి పది గంటల వరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లు 295000 డాలర్లు(రూ.2,05,54,125). న్యూజిలాండ్‌లో 18 ప్రదేశాల్లో విడుదలైన ఈ చిత్రం 23,243 న్యూజిలాండ్ డాలర్లు (రూ.11.11 లక్షలు) రాబట్టింది. ఆస్ట్రేలియాలో 114,696 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.58.46 లక్షలు) రాబట్టింది. అక్కడ ఈ చిత్రం 35 ప్రదేశాల్లో విడుదలైంది.
Post A Comment: