సాధారణంగా ఏ కథానాయకుడైనా స్క్రిప్ట్‌ చదవకుండా సినిమా చేస్తాడా? కానీ తాను చేశానని చెబుతున్నాడు బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్. 35ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సన్నీ నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే, ఇన్నేళ్ళ తన కెరీర్‌లో ఒక్క చిత్రానికీ తాను స్క్రిప్ట్‌ చదవలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాల్లో పనిచేయడం సహజ సిద్ధంగా అలవడిందన్న ఆయన స్క్రిప్ట్‌లు చదవడం కన్నా కథలు వినడమే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

‘నేను చాలా సహజగుణం కలిగిన వ్యక్తిని. నాకు ఎవరైనా ఐడియా ఇచ్చినా, లేదా ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచన చెప్పినా ఒకసారి అది నచ్చితే, అవసరమైతే దాని కోసం దూకేస్తా. దాని వివరాల జోలికి అస్సలు పోను. నా కెరీర్‌లో ఇప్పటివరకూ అదే జరిగింది. అయితే, సినిమా చిత్రీకరణ అనేది ఇందుకు కాస్త భిన్నం.’’ అని అన్నారు.

1983లో ‘బేతాబ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సన్నీ దేఓల్‌ బలమైన కథలను ఎంచుకుని తనదైన మార్కు నటనతో అలరించారు. అందులో ‘ఘాయల్‌’, ‘దామినీ’, ‘ఢర్‌’, ‘గదర్‌: ఏక్‌ ప్రేమకథా’ వంటి కథా బలమున్న చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో స్క్రిప్ట్‌లు చదవకుండా సినిమాలు చేయడమనేది నిజంగా సాహసమేనని చెప్పాలి. అయితే ఇప్పటికీ సన్నీ డియోల్ అదే దారిలో నడుస్తున్నారు.

ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి నీరజ్‌ పాథక్‌ దర్శకత్వం వహించారు. ప్రీతి జింటా, అమీషాపటేల్‌, ఎల్విన్‌ శర్మ, అర్షద్‌ వార్సి, శ్రేయాస్‌ తల్పాడేలు కీలకపాత్రలు పోషించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: