Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

కోలీవుడ్‌కు చెందిన వర్దమాన సినీ తార ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన చెన్నైలో బుధవారం చోటుచేసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్యే కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ రియామికా (26) బుధవారం వలసరవాక్కంలోని తన హౌస్ లో ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. శ్రీదేవి కుప్పానికి చెందిన రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.

పలు తమిళ చిత్రాల్లో నటించిన రియామిక, 'కుద్రతైల్ కుమారాం కొందత్తం', 'అఘోరి యనిట్టం ఆరంభం' సినిమాల్లో కథానాయికిగా మెప్పించారు. అయితే ఆమె కొంత కాలంగా డిప్రెషన్‌ కి గురవుతున్నారని.. ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు. అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం అనేక సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రోయాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదని, విచారణలో అన్నీ బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటో తెలియలేదని పేర్కొన్నారు. ఇటీవల అవకాశాలు తగ్గడంతో తీవ్ర ఒత్తిడికి గురైన రియామిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రియామిక మొబైల్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చివరి సారిగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ దినేశ్‌తోనే మాట్లాడినట్టు గుర్తించారు.

గురువారం ఉదయం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: