చిత్రం: పెళ్ళిరోజు
తారాగణం: దినేష్, నివేథా పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ తదితరులు
మాటలు: మల్లూరి వెంకట్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: గోకుల్ బెనోయ్
కూర్పు: సాబు జోసెఫ్
కూర్పు: సాబు జోసెఫ్
సమర్పణ: ప్రవీణ్ కందికట్టు
నిర్మాతలు: మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి
దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
బ్యానర్: సినీయోగ్ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ: 08 డిసెంబర్ 2018
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ‘ఒరు నాల్ కూతు‘ పేరుతో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ‘పెళ్లిరోజు‘ అనే టైటిల్ తో తెలుగులో అనువదించారు. దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ కందికట్టు సమర్పణలో మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలుసుకుందాం.
కథ:
పెళ్ళిరోజు కోసం ఎదురుచూసే ముగ్గురు అమ్మాయిల కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘పెళ్లిరోజు’. ఒక్కో అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కాలనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆ ముగ్గురి జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలుపుతూ చివరికి వారి పెళ్లి తంతు ఎలా ముగిసిందనేది కాన్సెప్ట్.
ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న కావ్య (నివేథా పేతు రాజు), రాజ్ (దినేష్) ప్రేమలో పడతారు. అమ్మాయి ధైర్యంగా తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెబుతుంది. ఈ తరుణంలో రాజ్‌ను తన తండ్రికి పరిచయం చేయాలని మొదట్లో ఒకట్రెండుసార్లు కావ్య ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు అక్కడికెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేదాన్ని ముందుగానే ఊహించుకుని రాజ్ వెళ్లడానికి సాహసించడు. ఈ లోగా కావ్య ఫాదర్, పేదవాడైన రాజ్ ను అంగీకరించక కావ్యకు వేరే సంబంధం చూస్తాడు. తప్పని పరిస్థితిలో ఆ పెళ్లిని అంగీకరిస్తుంది కావ్య. అయితే ఆ పెళ్ళి జరిగిందా..?
ఇక రెండో అమ్మాయి లక్ష్మీ(మియా జార్జ్). ఆమె తోబుట్టువులిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతాయి. లక్ష్మీకి మాత్రం మంచి ఉద్యోగం ఉండేవాడికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి (నాగినీడు) వెతకటం మొదలుపెడతారు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోతాయి. తండ్రి చాటు పెరిగిన అమ్మాయి కావడంతో ఎదిరించలేక తానూ కూడా పెళ్లి చూపులకు సిద్దపడుతూనే ఉంటుంది. ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి లక్ష్మి అమితంగా నచ్చడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళ ప్రయత్నం నెరవేరిందా..?
ఇక మూడో అమ్మాయి సుశీల (రిత్విక) రేడియో జాకీ గా పని చేస్తుంటుంది. పెళ్లి కోసం చాన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పోతుంటాయి. ఈ క్రమంలోనే ఓ సంబంధం ఖాయం అవుతుంది. మొదట ఆ పెళ్ళికి ఒకే చెప్పినా నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని సుశీలకు చెబుతాడు పెళ్ళికొడుకు. షాక్ తిన్న సుశీల ఎలాగైనా అతనిని పెళ్లికి ఒప్పించమని ఆమె అన్నయ్యను అడుగుతుంది. సుశీల అన్నయ్య, అతని స్నేహితుడు (చార్లీ) నచ్చచెప్పడంతో పెళ్ళికొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..?
ఇలా ఈ ముగ్గురి పెళ్ళిళ్ళకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి..? ఆ ముగ్గురు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నదే 'పెళ్లిరోజు' క్లైమాక్స్.
నటన:
కథా ప్రాధాన్యమున్న చిత్రం కాబట్టి నటులకన్నా పాత్రలే మనకి కనబడతాయి. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ బాడీగార్డ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ ఈ చిత్రం లో రాజ్ పాత్రను చేసి మెప్పించాడు. ‘మెంటల్ మదిలో’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేథా పేతురాజ్ కావ్య పాత్రలో చక్కగా మెప్పించింది. సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ లో నటించిన మియా జార్జ్ లక్ష్మి పాత్రలో చాలా అమాయకురాలిగా, అందంగా కనిపిస్తుంది. తమిళ ‘బిగ్ బాస్ 2’ విజేత రిత్విక సుశీల పాత్రలో ఒదిగిపోయింది. ఇక మధ్య మధ్యలో హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన బాల శరవణన్, ఆర్జే పాత్రలో రమేశ్ తిలక్ టైమింగ్‌ను బట్టి కామెడీ బాగా పండించారు. ఇలా ఎవరికీ వారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికత:
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ సార్వజనీన కాన్సెప్ట్ ను తెరకెక్కించాడని చెప్పొచ్చు. కథా కథనాలు మన పక్కింటి వాళ్ళ జీవితాలను చూసి రాసుకున్నాడా అనిపించేలా చాలా సహజంగా అనిపిస్తాయి. సీరియస్ కథను ఎంచుకోవడమే కాకుండా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అత్యంత సహజంగా చిత్రీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎవరి కథ ఎలా మలుపు తిరుగుతుందో క్లైమాక్స్ లో చాలా చక్కగా చూపించాడు. అమ్మాయిల ఆలోచనలను వారికున్న సహనాన్ని కన్నులకు కట్టినట్టుగా, అర్థవంతంగా చూపించాడు.
తమిళంలో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగులో కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని ‘చిలకా చిలకా’ పాట ఇప్పటికే మంచి హిట్. సోషల్ మీడియా సెన్సేషన్ పల్లె కోయిల ‘పసల బేబి’ ఈ చిత్రంలో 'ఏంటే ఏంటే' పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి అందించిన మల్లూరి వెంకట్ మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ, సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి.
ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్న సంగతి ప్రేక్షకులకి ఎక్కడా అనిపించకుండా.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలా చిత్రబృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
చివరికేమిటి:
ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు అద్దం పట్టిన చక్కటి చిత్రం 'పెళ్లిరోజు'.
రేటింగ్: 3.5/5
Post A Comment: