Screen Writing | Screenplay Writing | Screenplay Structure | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com


తెలుగు సినిమా స్క్రీన్ ప్లే

సినిమా స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం విలువని గుర్తించకపోతే చాలా నష్టం కథకి. నూటికి 90 శాతం మంది ఇది తెలుసుకోకుండానే రాసేస్తున్నారు. స్క్రీన్ ప్లేకి బిగినింగ్ ముఖ చిత్రమైతే మిడిల్ దేహం. దేహం లేకుండా, ఒకవేళ వున్నా సగానికి కుదించి, ఇంకా ఆ సగంలో సగానికి కూడా కుదించి రాసే స్క్రీన్ ప్లేలు నిజానికి స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లేలో సగ భాగం అంటే 50 శాతం నిడివితో మిడిల్ విభాగం వుంటే అది ఉత్తమ స్ట్రక్చర్. 25 శాతం వుంటే బలహీన స్ట్రక్చర్, 25 శాతం కన్నా తక్కువ వుంటే అది స్క్రీన్ ప్లేనే కాదు. మిడిల్ విభాగం బిజినెస్ లోకి వెళ్ళే ముందు మిడిల్ భౌతిక స్వరూపం గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం. ఓ రెండు గంటల స్క్రీన్ ప్లే వుందంటే అందులో అరగంట సేపు బిగినింగ్, ఓ గంటసేపు మిడిల్, ఇంకో అరగంట సేపూ ఎండ్ విభాగాలుండాలన్న మాట - శాతాల్లో చూస్తే స్ట్రక్చర్ 25%- 50%- 25% గా ఉండాలన్న మాట. అంటే 1 : 2 : 3 నిష్పత్తులన్న మాట. ఎటొచ్చీ మిడిల్ అనేది బిగినింగ్, ఎండ్ విభాగాల కంటే రెట్టింపు సైజులో ఉండాలన్న మాట.

ఎందుకు రెట్టింపు సైజులో వుండాలి? అసలు కథంతా ఇక్కడే వుంటుంది కాబట్టి. బిగింగ్ అనేది కథకాదు. అది కథని పరిచయం చేసే ప్రవేశ ద్వారం మాత్రమే. అలాగే ఎండ్ కూడా కథ కాదు. అది కథకి ముగింపు పలికే నిష్క్రమణ మార్గం మాత్రమే. మిడిల్ లో వున్న కథని పరిచయం చేసేది బిగినింగ్ అయితే, మిడిల్లో నడిచిన కథకి ముగింపుకి తెచ్చేది ఎండ్. ఎక్కడైతే కథా పరిచయ విభాగం ‘బిగినింగ్’ అనేది ముగింపు కొస్తూ సమస్యని ఏర్పాటు చేస్తుందో, ఆ బిందువుని ప్లాట్ పాయింట్ -1 అంటున్నాం. ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర నుంచీ ప్రారంభమయ్యేది మిడిల్. ఇది ఇంటర్వెల్ మీదుగా కొనసాగి అవతల ప్లాట్ పాయిట్ -2 అనే మరో బిందువు దగ్గర అంతమవుతుంది. ఈ బిందువు ప్లాట్ పాయిట్ - 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచించే బిందువు. అంటే బిగినింగ్ అందించే సమస్యని తీసుకుని మిడిల్ తనదైన బిజినెస్ తో సాధించి ఓ పరిష్కారమార్గాన్ని కనుగొని ఎండ్ కి అందిస్తుందన్న మాట. బిగినింగ్ అందించే సమస్యని పరిష్కరిస్తూ ఎండ్ కి అందించడం మిడిల్ నిర్వర్తించే కార్యకలాపమన్న మాట. పిండి మర నోటి దగ్గర గోధుమలు పోస్తే, ఆ మర గోధుమల్ని ఆడించి పిండిగా మార్చి బయటికి ఎలా పంపుతుందో, స్క్రీన్ ప్లేలో మిడిల్ చేసే పని కూడా ఇలాటిదే : తన నోటికి బిగినింగ్ అందించే సమస్యని మరాడించి, పరిష్కార మార్గాన్ని ఎండ్ కి అందించడం.

మరలో గోధుమలు ఎంతసేపు పోస్తారు? అది క్షణాల్లో పని. ఆ గోధుమలు పిండిగా మారడానికి నిమిషాలు పడుతుంది. చివరికి బయటికి రావడం మళ్ళీ క్షణాల్లో పనే. అలాగే స్క్రీన్ ప్లే ప్రారంభంలో బిగినింగ్ విభాగం మిడిల్ విభాగానికి సమస్యని అందించడం అంత చప్పున జరగాలి. ఆ సమస్యని మిడిల్ మరాడించడానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు. సమస్యని అందించడానికే బిగినింగ్ చాలా సమయం తీసుకుంటే, మరాడించడానికి మిడిల్ కి చాలినంత సమయం దొరకదు. ఎందుకంటే దాని టైము ప్రకారం అది అవతల ఎండ్ కి పరిష్కారం అందించాలి.

ఎండ్ సమయాన్ని తను తినేయ్యడానికి లేదు. ఎంత మిడిల్ సమయాన్ని బిగినింగ్ తినేసి పంక్చువాలిటీ లేకుండా ప్రవర్తించినా, మిడిల్ మాత్రం ఎండ్ తో పంక్చువాలిటీ తోనే వుంటుంది. మిడిల్ మరాదించే సమయాన్ని బిగినింగ్ సమస్యని అందించడానికి తాత్సారం చేస్తూ ఎంత తినేస్తే అంత మిడిల్ సమయం తగ్గి- ఆ మేరకు కథ కూడా తగ్గిపోతుంది...

కథంటే మిడిలే!
ఈ కింది పటం చూడండి:

ఇందులో బిగినింగే ఇంటర్వెల్ వరకూ సాగుతోంది. భారతీయ సినిమాల్లో సర్వసాధారణంగా వుండే స్ట్రక్చర్ ఇది. రెండు గంటల సినిమా వుందంటే సమస్యని స్థాపించడానికి ఇంటర్వెల్ వరకూ గంట సేపు సమయం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సమస్య స్థాపించే వరకూ కథ ప్రారంభమేకావడం జరగదని ప్రధానంగా గమనించాలి. రెండు గంటల సినిమాలో సగభాగం సమయం, అంటే స్క్రీన్ ప్లే లో 50% నిడివి అంతా ఇలా 25 % ఉండాల్సిన బిగినింగే తీసుకుంటే అంకాలు స్థానభ్రంశం చెందినట్టే. మొదటి అంకం అంటే బిగినింగ్ వెళ్లి- రెండో అంకం మిడిల్ లోకి జొరబడి ఇంటర్వెల్ వరకూ చోటుని ఆక్రమిస్తే, మిడిల్ వెళ్లి ఇంటర్వెల్ తర్వాత సర్దుకుంటోంది పై పటంలో. దీంతో ఫస్టాఫ్ లో ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ కొచ్చి 50% ఉండాల్సిన మిడిల్ సైజు, ఇంటర్వెల్ తర్వాత మాత్రమే సగానికి, అంటే 25 % కుంచించుకు పోతోంది. ఐదవ తరగతి చదివే కుర్రాడు ఐదవ తరగతి లోనే కూర్చోవాలి. వాడు వెళ్లి ఆరో తరగతిలో జొరబడితే అక్కడ కలకలం రేగుతుంది. వాడు ఇరికిరికి కూర్చునే సరికి ఆరో తరగతి కుర్రాళ్ళు కూడా వాడికి చోటు వదిలి తామూ ఇరికిరికి కూర్చోవాల్సి వస్తుంది. తిక్కరేగితే వాణ్ణి తన్ని వెళ్ళగొట్టవచ్చు. కానీ మిడిల్ చోటుని దర్జాగా కబ్జా చేసే బిగినింగ్ ని మెడబట్టి గెంటేసేందుకు మనసొప్పదు భారతీయ స్క్రీన్ ప్లే కళాకారులకి. తమ సొమ్మేం పోయింది- కొంప లంటుకునేది నిర్మాతలకే కదా. వెరసి మెజారిటీ భారతీయ సినిమాల స్క్రీన్ ప్లే స్ట్రక్చర్= 50% బిగినింగ్, 25% మిడిల్, 25% ఎండ్ = 2 : 1 : 1 = బిగినింగ్ గంట + మిడిల్ అరగంట + ఎండ్ అరగంట = ఫస్టాఫ్/సెకండాఫ్ స్క్రీన్ ప్లే మోడల్ అన్నమాట!

బిగినింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్సు. ఆ బిగినింగ్ సాగే ఇంటర్వెల్ వరకూ కథ వుండదు మళ్ళీ. కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, పాటల కార్యక్రమం వీటితోనే గడిచిపోయి- ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడో పాయింటు తో సమస్యా స్థాపన. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లోనే మిడిల్ ప్రారంభం. అంటే ఇక్కడే కథ ప్రారంభమవుతుంది ఇంటర్వెల్లో ఏర్పాటు చేసిన ఆ సమస్యని పట్టుకుని. సెకండాఫ్ లో వుండే ఆ గంట సమయంలోనే మిడిల్ నీ, ఎండ్ నీ సర్దాలి కాబట్టి- మిడిల్ కోఅరగంట, ఎండ్ కో అరగంటా దక్కుతాయి. ఎండ్ కి ఇబ్బంది లేదు. దాని సైజు మారదు. ఇలా మొత్తం రెండు గంటల నిడివిగల సినిమాలో కథ ( మిడిల్) నడిచేది అరగంట సేపే నన్న మాట. అరగంట కథ కోసం గంటన్నర సినిమా భరించాలి ప్రేక్షకులు. ఇదొక శ్రమ తప్పించుకునే స్కామ్ కాకపోతే ఏమిటి?

ఇంతేనా? ఇంకో పెద్ద స్కామ్ కూడా వుంది. స్క్రీన్ ప్లే రైటింగ్ పేరుతో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ లో అసలు శ్రమించడమే వుండదు. పై రెండో పటం చూస్తే ఇదేమిటో తెలుస్తుంది. ఈ స్కామ్ దెబ్బకి ఏ సినిమా కూడా ఒక్క పూట ఆడే ప్రసక్తే లేదు. ‘అఖిల్’ అయినా సరే, ‘కిక్-2’ అయినా సరే. మిడిల్ ని గౌరవించక పోతే ఆ మిడిల్ నిర్మాతల్ని లెక్క చెయ్యదు. ఈ పటంలో మిడిల్ ని కూడా మింగేస్తూ బిగినింగే ఎండ్ దాకా సాగుతోంది.. ఎప్పుడో ఫస్టాఫ్ లోనే ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లోకి ఎంటరై 50% ఉండాల్సిన మిడిల్, ఇక్కడ 12.5% శాతానికి చిక్కిశల్యమై, వెళ్ళేసి ఎండ్ విభాగపు చోటులో ఇరుక్కుంటోంది. ఎండ్ కూడా 12.5% శాతానికి చిక్కిపోతోంది. అంటే ఇలా క్లైమాక్స్ దగ్గర మాత్రమే ప్రారంభమయ్యే కథ, అప్పుడే మొదలై అప్పుడే ముగిసిపోయే అగత్య మన్నమాట. ఈ కింది పటంలో కూడా చూడండి మిడిల్ పరిస్థితి. అందుకే మిడిలే (కథే) వుండని ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే!

ఇలా జరగడానికి సినిమా మొత్తంగా నడిచేది కథే అనే దురభిప్రాయంతో ఉండడమే కారణం. సినిమా మొత్తం నడిచేది కథే కాదు, మిడిల్ లో వుండేది మాత్రమే అసలు కథ, ప్రాణం, బలిమి, సింహాసనం, కథాపాలనా వగైరా. బిగినింగ్ లో వుండేది కేవలం ఉపోద్ఘాతమేననీ, అలాగే ఎండ్ లో వుండేది కూడా కేవలం ఉపసంహారమేననీ సాంకేతిక దృక్కోణంలో స్క్రీన్ ప్లే ని చూడకపోతే మిగిలేది రోదనే.

ప్రేక్షకుల సమయం విలువైనది. ఆ విలువైన సమయాన్ని సమాదరిస్తే వాళ్ళుకూడా సినిమాని ఆదరించే అవకాశం వుంటుంది. కథ చెప్పాలనుకుంటే చప్పున ఫస్టాఫ్ లోనే ప్రారంభించాలి మిడిల్ ని. ఉపోద్ఘాతాల చాపల్యం, ఉపసంహారాల ప్రకోపం అదుపులో వుంచుకోవాలి. కింద చూపిన పటాల్లో విధంగా కథని సకాలంలో ప్రారంభిస్తే స్ట్రక్చర్ అర్ధవంతంగా వుంటుంది:

ఈ సార్వజనీన, ప్రామాణిక త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వున్న ‘దేవదాసు’ ని చూస్తారా, ‘పాండురంగ మహాత్మ్యం’ ని చూస్తారా, ‘అల్లూరి సీతారామరాజు’ ని చూస్తారా- ఇంకా వందల్లోవున్న- ఆనాటి ఎన్నో సినిమాల్ని చూస్తారా మీ ఇష్టం. ఏమైపోయింది ఆనాటి నమ్మక మైన స్ట్రక్చర్? ఏమైపోయింది మిడిల్ కి అంతటి గౌరవం? ఫస్టాఫ్/సెకండాఫ్ స్ట్రక్చర్ తో మిడిల్ విలువని తగ్గించింది గాక, అసలు మిడిలే వుండని మిడిల్ మటాష్ స్ట్రక్చర్ అనే కొత్త వైకల్యాన్ని ఎందుకు సంతరించుకుని భారీ సినిమాల్ని సైతం మట్టి కరిపించుకునే దాకా వచ్చింది?
(ఇంకా ఉంది) 

—సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: